మొదటిసారి నెపోటిజంపై నోరు విప్పిన రామ్ చరణ్!
మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రామ్ చరణ్. చిరుత, మగధీర, రచ్చ, ధృవ, రంగస్థలం వంటి సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని మెగా పవర్‌స్టార్‌గా ఎదిగారు. ఇక RRR సినిమాతో పాన్ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్. అమెరికాలో జరిగిన ఆస్కార్ సంబరాన్ని పూర్తి చేసుకుని ఆనందంగా సొంతగడ్డపై అడుగుపెట్టింది చిత్ర బృందం. ఢిల్లీలో నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే దేశంలోనే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో మాట్లాడేందుకు నేరుగా ఢిల్లీకి వెళ్ళాడు చరణ్. శుక్రవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమంలో మాట్లాడిన చరణ్ అనేక విషయాలు మీడియాతో పంచుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చరణ్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ నెపోటిజంపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఫ్యామిలీ, సినిమా, రాజమౌళి, RRR, పర్సనల్ విషయాలు.. ఇలా చాలా మాట్లాడారు. రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ..‘ మా నాన్న, పవన్ కళ్యాణ్ బాబాయ్ తర్వాత నేను ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేది రాజమౌళికే. మా నాన్న, పవన్ బాబాయ్ నాకు రెండు కళ్ళ లాంటివాళ్లు. ఆస్కార్ గెలిచాక మా నాన్న నన్ను చూడటానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చేశారు. ఇక్కడే ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతం. త్వరలో రంగస్థలం కంటే బెటర్ క్యారెక్టర్ చేయబోతున్నాను. మరో మట్టి సినిమా అవుతుంది. చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఆ సినిమా. సెప్టెంబర్ లో షూట్ మొదలవ్వబోతుంది’ అన్నారు రామ్ చరణ్.
అలాగే నెపోటిజం గురించి మాట్లాడుతూ.. ‘ఎవరైనా స్టార్స్ సక్సెస్ అయ్యారు అంటే ఓన్లీ ట్యాలెంట్, హార్డ్ వర్క్ మాత్రమే కారణం. నెపోటిజం అస్సలు కారణం కాదు. అలాగే ఇండియన్ సినిమాలో మన చరిత్ర, మన మట్టి స్టోరీలు చెప్పాలి. తెలుగు, హిందీ, ప్రాంతీయ సినిమాలు పోయాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఒక్కటే’ అని అన్నారు రామ్ చరణ్. తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఓ హాలీవుడ్ సినిమాలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయి. అది ఓకే అయ్యేదాకా నేను ఏం చెప్పను. నాకైతే హాలీవుడ్ లో నటించాలని ఉంది. భవిష్యత్తులో కచ్చితంగా నటిస్తాను’ అని అన్నారు. ఇక ర్యాపిడ్ ఫైర్ లో పలు ప్రశ్నలు అడగగా.. కియారా తన బెస్ట్ కో స్టార్ అని, చిరంజీవి తర్వాత సల్మాన్ ఖాన్ చిన్నప్పటి నుంచి ఫేవరేట్ హీరో అని, స్విట్జర్లాండ్, రాజస్థాన్ ఫేవరేట్ ప్లేసెస్ అని, హార్స్ రైడింగ్, సినిమాలు చూడటం హాబీలు అని చెప్పుకొచ్చారు చెర్రీ.