అమిత్​ షాని కలిసిన మెగా హీరోలు!

RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు మెగాపవర్​స్టార్​ రామ్​ చరణ్​. 95 అకాడమీ వేడుకల్లో ఆర్​ఆర్​ఆర్​ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్​ సాధించిన విషయం తెలిసిందే. ఆస్కార్​ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆస్కార్​తో దేశంలో అడుగుపెట్టిన ఆర్​ఆర్​ఆర్​ టీమ్​కి ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలో నేషనల్​ మీడియా ఇండియా టుడే నిర్వహించే దేశంలోనే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రామ్​కి హాజరు కావాల్సి ఉండగా నేరుగా ఢిల్లీ వెళ్ళాడు చరణ్. ఈ కార్యక్రమంలో మాట్లాడి అనేక విషయాలు మీడియాతో పంచుకున్న చరణ్ తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవి సమేతంగా కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల RRR మూవీ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంతో అమిత షా చరణ్ కు శాలువా కప్పి సన్మానించారు. అయితే చరణ్, చిరంజీవి కలిసి అమిత్ షాను కలవడంతో ఇటు సినీ పరిశ్రమలోనే కాక రాజకీయాల్లో కూడా చర్చగా మారింది. దీనిపై చిరంజీవి ట్విట్టర్ లో అమిత్ షాని కలిసిన ఫోటోలని షేర్ చేస్తూ.. థ్యాంక్యూ అమిత షాజీ RRR టీం తరపున చరణ్ ని సన్మానించి ఆశీర్వదించినందుకు అంటూ పోస్ట్ చేశారు.

ఇక రాత్రి చరణ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీలో ఫ్లైట్ లో చరణ్, ఉపాసన, చిరంజీవి కలిసి హైదరాబాద్ కి ప్రయాణించనట్టు సమాచారం. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్​లో మెగా హీరోలకు ఘన స్వాగతం లభించింది. ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో పాన్​ ఇండియా స్టార్​గా పేరుతెచ్చుకున్న రామ్​ చరణ్​కి హాలీవుడ్​ నుంచి కూడా అవకాశాలు అందుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్​ చరణ్​, తమిళ స్టార్​ డైరెక్టర్​ శంకర్​తో చేస్తున్న సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా RC15 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతోంది. కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టైటిల్​ను ఈనెల 27న రామ్​ చరణ్​ బర్త్​డే స్పెషల్​గా ప్రకటిస్తామని అభిమానులకు తెలియజేసింది చిత్రబృందం. ఇక, మెగాస్టార్​ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం భోళాశంకర్​ సినిమా షూటింగ్​తో బిజీగా ఉన్నారు మెగాస్టార్​. ఈ సినిమాలో కీర్తి సురేష్​ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెహర్​ రమేష్​ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్​లో భారీ అంచనాలు ఉన్నాయి.