ఇద్ద‌రు కొట్టుకుంటే మూడో వ్య‌క్తికేగా లాభం..!

ఇద్ద‌రు కొట్టుకుంటే మూడో వ్య‌క్తికే లాభం అనే సామెత ఇప్పుడు మ‌న రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌కు బాగా స‌రిపోతుంది. మ‌రిన్ని ఐటీ కంపెనీలు, ఉద్యోగాలు, మాల్స్, పెట్టుబ‌డులు తెలంగాణ‌కు (telangana) తీసుకురావాల‌ని ఓ ప‌క్క ఐటీ శాఖ మంత్రి KTR ఎంతో శ్ర‌మిస్తున్నారు. ఈ లేనిపోని రాజ‌కీయ లొల్లి కంటే కాస్త బ‌య‌టికి పోయి ఇన్‌వెస్ట‌ర్ల‌ను తీసుకురావ‌డం బెట‌ర్ అనేది KTR పాల‌సీ. ఏ రాష్ట్రంలో అయినా రాజ‌కీయ స‌మ‌స్య‌లు ఉంటాయి. అయినంత‌మాత్రాన అవే మ‌న‌సులో పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోకుండా కూర్చుంటే న‌ష్టం ఎవ‌రికి?

ఇప్పుడు ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ర‌చ్చ‌ల గురించి అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ లేనంత వేడిగా ఏపీ రాజ‌కీయాలు ఉన్నాయి. 2019లో ఎప్పుడైతే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) అధికార కుర్చీపై కూర్చున్నారో మొద‌టి రోజు నుంచే TDP చేప‌ట్టిన ప్ర‌తి ప‌నినీ అడ్డుకోవాల‌ని చూసారు. చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) త‌న హ‌యాంలో తీసుకొచ్చిన పెట్టుబ‌డుల్ని ఆపేసారు. కొత్త‌గా నిర్మించిన భ‌వ‌నాల‌ను అక్ర‌మ క‌ట్ట‌డాలు అని కూల్చేసారు. వీటికి అధికార YSRCP ద‌గ్గ‌ర స‌మాధానాలు ఉండొచ్చు. వారు చెప్తున్న కార‌ణాలు కూడా నిజం కావ‌చ్చు. కానీ ఇక్క‌డ ఎవ‌రు న‌ష్ట‌పోతున్నారు అంటే TDP, YSRCP కాదు.. ప్ర‌జ‌లు.

కోపంతో వెళ్లిపోయిన లులు

చంద్ర‌బాబు నాయుడు ఉన్న‌ప్పుడు అబుదాబికి చెందిన ప్ర‌ముఖ సంస్థ లులు (lulu) ఏపీలో 2,200 కోట్ల పెట్టుబ‌డితో క‌న్వెన్ష‌న్ సెంట‌ర్, షాపింగ్ మాల్ నిర్మించాల‌నుకుంది. కానీ ఎప్పుడైతే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిందో లులు సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్లు పార‌దర్శ‌కంగా లేవ‌ని లోపాలు ఉన్నాయ‌ని ఆరోపించింది. దాంతో లులు సంస్థ‌కు ఒళ్లుమండింది. పెట్టుబ‌డికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు క్లియ‌ర్‌గా ఉన్నాయ‌ని ఆరోపిస్తూ.. ఇక ఏపీలో త‌మ సంస్థ పెట్టుబ‌డి పెట్ట‌దు అని చెప్పి వేరే రాష్ట్రాల‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద లులు మాల్‌ను KTR ప్రారంభించారు.

అమ‌ర‌రాజా, పేజ్ సంస్థ‌ల‌దీ ఇదే ప‌రిస్థితి

అతిపెద్ద లిథియం బ్యాట‌రీల త‌యారీ సంస్థ అయిన అమ‌ర‌రాజా (amara raja) కంపెనీ కూడా ఇప్పుడు తెలంగాణలో పెట్టుబ‌డి పెట్టాల‌ని చూస్తోంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. ఇది TDP ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌కి (galla jayadev) చెందిన సంస్థ కావడం. కానీ YSRCP ప్ర‌భుత్వం మాత్రం.. అమ‌ర రాజా కంపెనీ మూసివేత‌కు కార‌ణం.. ఆ కంపెనీ నుంచి అధికంగా వెలువ‌డుతున్న లెడ్, దాని వ‌ల్ల ప‌రిస‌ర ప్రాంత ప్రజ‌ల‌కు క‌లుషిత‌మైన నీరు వ‌స్తోంద‌ని చెప్పారు. పేజ్ (page) సంస్థ‌దీ ఇదే ప‌రిస్థితి. పేజ్ అనేది జాకీ బ్రాండ్‌కి చెందిన లోదుస్తుల‌ను త‌యారుచేసే కంపెనీ.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ease of doing business) అంటే వ్యాపారాలు చేసుకోవ‌డానికి అనువైన ప్ర‌దేశంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ టాప్‌లో ఉంద‌ని కేంద్రం ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. అతిపెద్ద తీర ప్రాంతం, ఎన్నో పోర్టులకు నివాస‌మైన ఏపీలో రాజ‌కీయ క‌క్ష‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి పెట్టుబ‌డుల‌పై ఫోక‌స్ చేసి ఉంటే మ‌రో సిలికాన్ సిటీ అయివుండేద‌ని అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. అక్క‌డి యువ‌త సొంత ఇళ్లు, త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలేసి ఉద్యోగాల కోసం తెలంగాణ‌కు వ‌చ్చి ఉండేవారూ కాదు.

తెలంగాణ‌కు లాభం

ఏపీలో రాజ‌కీయ క‌క్ష‌ల‌తో కంపెనీల‌ను పెట్ట‌నివ్వ‌కుండా, ఇన్‌వెస్ట‌ర్ల‌ను బెద‌ర‌గొట్ట‌డంతో అక్క‌డ పెట్టుకోవాల్సిన కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. అయితే వారంతట వారే తెలంగాణ‌కు రాలేదు. KTR స్వ‌యంగా ఇన్‌వెస్ట‌ర్ల‌తో చర్చించి వారికి ఎలాంటి స‌దుపాయాలు కావాలో తెలుసుకుని డిస్కౌంట్లు వంటివి క‌ల్పించి మ‌రీ తెలంగాణ‌కు పెట్టుబ‌డుల‌ను కంపెనీల‌ను తీసుకొస్తున్నారు. ఏపీలో అమ‌ర‌రాజాను మూసేస్తే ఇప్పుడు మహ‌బూబ్‌న‌గర్‌లోని దివిటిప‌ల్లిలో ఈ ఫ్యాక్టరీని పెట్టేందుకు రూ.9,500 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్నారు. పేజ్ సంస్థ‌ను కూడా అనంత‌పూర్ నుంచి గెంటేస్తే ఇప్పుడు కేటీఆర్ ఆ సంస్థ‌ను ములుగు, ఇబ్ర‌హీంప‌ట్నం ప్రాంతాల్లో రూ.290 కోట్ల పెట్టుబ‌డితో పెట్టిస్తున్నారు. 2021 జూన్‌లో అమెరికాకు చెందిన ట్రైటాన్ సంస్థ కూడా మొద‌ట్లో నారా లోకేష్ హ‌యాంలో ఏపీలో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంది. జ‌గన్ స‌ర్కార్ వ‌చ్చాక ట్రైటాన్ త‌ప్పుకోవాల్సిన పరిస్థితి వ‌చ్చింది.

అలాగ‌ని KTR ఏపీ సంస్థ‌ల‌ను లాగేసుకుంటున్నారు అన‌డానికి వీల్లేదు. ఆయ‌న‌కు అందిన స‌మాచారం మేర‌కు ఏ కంపెనీకి అయినా ఎక్క‌డైనా స్థ‌లం కానీ అనుమ‌తి కానీ దొర‌క్క‌పోతే ఆయ‌నే స్వ‌యంగా వెళ్లి మాట్లాడుకుని తెలంగాణ‌లో పెట్టుబ‌డి పెట్టేలా కృషి చేస్తున్నారు. జులై 2021లో కేర‌ళ‌లో కైటెక్స్ అనే సంస్థ 3,500 కోట్ల పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అక్క‌డ పెట్ట‌లేక‌పోయింది. దాంతో KTRకి ఈ విష‌యం తెలిసి వెంట‌నే కేర‌ళ‌కు ఓ ప్రైవేట్ జెట్ పంపించి మ‌రీ కైటెక్స్ సంస్థ అధినేత స‌బు జేక‌బ్‌ని హైద‌రాబాద్‌కి పిలిపించారు. అన్నీ ఓకే అనుకుంటే తెలంగాణ‌లో పెట్టుబ‌డి పెట్టాల‌ని పిలుపునిచ్చారు.

ఆంధ్ర తెలంగాణ విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి అమ‌రావ‌తిని రాజ‌ధాని చేసి దానిని ఒక ఐటీ హ‌బ్‌గా మార్చాల‌ని అనుకున్నారు చంద్ర‌బాబు నాయుడు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వచ్చాక అమ‌రావ‌తి లేదు బొక్క లేదు అని ఏపీకి రాజ‌ధానే లేకుండా చేసారు. ఇప్పుడు వైజాగే ఏపీకి రాజ‌ధాని అని.. అక్క‌డికే కార్యాల‌యాన్ని షిఫ్ట్ చేస్తున్నామ‌ని అంటున్నారు. ఇక ఇటీవ‌ల వైజాగ్‌లో జ‌రిగిన గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా 13 ల‌క్ష‌ల కోట్ల మేర పెట్టుబడులు ఏపీకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వీటిలో రూ.3 ల‌క్ష‌ల కోట్లు ఏపీ ప్ర‌భుత్వం పెట్టుకోనుంది. మ‌రి ఏ మేర‌కు ఇది స‌ఫ‌లీకృతం అవుతుందో వేచి చూడాలి.