అరుదైన గౌరవం దక్కించుకున్న కాంతార!

చిన్న సినిమాగా విడుదలై దక్షిణాదిన ప్రభంజనం సృష్టించిన సినిమా కాంతార. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలే ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ మంచి కలెక్షన్లు సాధించింది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వయంగా దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా కన్నడలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాను హిందీతోపాటు.. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్ చేసి విడుదల చేయగా.. అద్భుతమైన కలెక్షన్లతోపాటు ప్రశంసలు అందుకుంది. దీంతో రిషబ్ శెట్టికి పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సాధించి పెట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ సృష్టించిన ఈ సినిమా తాజాగా అరుదైన గౌరవం దక్కించుకుంది. జెనీవా (స్విట్జర్లాండ్ )లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో మార్చి 17న ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు హీరో రిషబ్ శెట్టి ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. అక్కడ సినిమా స్క్రీనింగ్ పూర్తైన అనంతరం ఆయన ప్రసంగించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమా పాత్ర గురించి ఆయన మాట్లాడనున్నారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంపై రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేసారు.

మార్చి 17న జెనీవాలోని ఐక్యరాజ్య సమితిలో పాథే బాలెక్సర్ట్ థియేటర్ లోని హాల్ నంబర్ 13లో ఈ సినిమా స్క్రినింగ్ జరగనుంది. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ‘పలు భారతీయ చిత్రాలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాయి. నా తాజా సినిమా కాంతారలోనూ ఆ అంశాన్ని ప్రస్తావించాం. ప్రకృతితో మనకున్న కనెక్షన్ ఏంటో ఈ చిత్రం తెలియజేస్తుంది. ఇలాంటి సినిమాలు ఎన్విరాన్‏మెంటల్ ఛాలెంజ్ లు స్వీకరించి సంబంధిత సమస్యలను పరిష్కరించగల స్పూర్తినిస్తాయి’ అంటూ చెప్పుకొచ్చారు.
యాక్షన్ థ్రిల్లర్ కాంతార చిత్రంలో ఆదివాసీల సాంప్రదాయ నృత్యమైన భూత కోలా చుట్టూ తిరుగుతుంది. ఇందులో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలకపాత్రలలో కనిపించారు. రూ. 16 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్లు రాబట్టింది. ఇక ఐరాసలో ప్రదర్శితమయ్యే తొలి కన్నడ సినిమాగా ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేసింది కాంతార. శాండల్​వుడ్​ సినిమాలు గతకొంత కాలంగా భారీ కలెక్షన్లు రాబడుతూ మంచి గుర్తింపు పొందుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్​, కేజీఎఫ్​2 చిత్రాలు హిందీలోనూ అధిక వసూళ్లను సాధించి పెట్టాయి. ఇక కేజీఎఫ్​ ప్రభంజనం తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు సాధించిన చిత్రం కాంతార. ఈ అరుదైన గౌరవంతో కాంతార ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోనుంది.