TSPSC- ప్రశ్నపత్రాల లీక్‌లో బిగ్ ట్విస్టు.. అసలు దొంగ దొరికాడు!
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో రోజుకో ఘటన వెలుగు చూస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేపడుతున్న సిట్ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పేపర్ల లీక్‌కు సంబంధించి ప్రధాన నిందితుడిగా అందరూ ప్రవీణ్ అని భావిస్తున్నప్పటికీ.. ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రధాన సూత్రధారిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నట్లు సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు టీఎస్పీఎస్సీకి శుక్రవారం సిట్ ఓ నివేదికను అందజేసిందట.
సిస్టమ్ పాస్వార్డు ఎలా తెలిసిందో..
టీఎస్పీఎస్సీలో ప్రస్తుతం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్… గతంలో టెక్నికల్ సర్వీస్‌లో పని చేసేవాడు. ఈక్రమంలో అక్కడ కంప్యూటర్ను హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ను దొంగిలించినట్లు సిట్ అనుమానిస్తోంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా విధుల్లో చేరాక.. ప్రవీణ్‌తో సంబంధాలు నడిపిన రాజశేఖర్.. సుమారు ఐదు పరీక్షా పత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి ప్రవీణ్‌కు ఇచ్చినట్లు అధికారులు నిర్దారించారు. ఫిబ్రవరి 27న పేపర్ లను ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ఇచ్చాడు. ఇందులో జులై నెలలో జరగాల్సిన జూనియర్ లెక్చరర్ పరీక్ష ప్రశ్నాపత్రం సైతం ఉందని సిట్ దర్యాప్తులో తేలింది అందుకే ఆ పరీక్షను కూడా కమిషన్ వాయిదా వేసినట్లు సమాచారం. ఈ మధ్యలో ప్రవీణ్.. రేణుకతో సంబంధాలు నడిపి.. ఏఈ ప్రశ్నాపత్రాలతో పాటు, మరికొన్ని ప్రశ్నపత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సిస్టమ్ పాస్‌వార్డును రాజశేఖర్ ఏవిధంగా చేజిక్కించుకున్నాడు అంశంపై కూడా సిట్ అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు పాస్‌వర్డ్‌ను శంకర్ లక్ష్మి అనే ఉద్యోగి డైరీ నుంచి కొట్టేశానని ప్రవీణ్ చెబుతున్నాడు. అయితే ఆమె మాత్రం పాస్‌వర్డ్‌ను తాను డైరీలో రాయలేదని చెబుతోంది. ఈనేపథ్యంలో శంకర్ లక్ష్మీ పాత్రపైనా సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. రోజుకో వ్యక్తి, రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుండటంతో అటు టీఎస్పీఎస్సీ, ఇటు కేసీఆర్ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.