ఆస్కార్​తో సొంతగడ్డపై అడుగుపెట్టిన RRR​ టీమ్​!

చాలారోజులుగా ఉత్కంఠగా ఎదురు చూసిన ఆస్కార్​ సంబరం ఎట్టకేలకు ఆనందంగా ముగిసింది. 95వ అకాడమీ వేడుకల్లో భారత సినిమా సత్తా చాటింది. ఆర్​ఆర్​ఆర్​ నుంచి నాటు నాటు పాట ఒరిజినల్​ సాంగ్​ కేటగిరీలో ఆస్కార్​ సొంతం చేసుకుంది. ఈ ఆనందాన్ని దేశమంతా పండుగల వేడుక చేసుకుంది. అమెరికాలోని లాస్​ఏంజిల్స్​ డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగిన ఆస్కార్​ వేడుకలు ముగియడంతో ఆర్​ఆర్​ఆర్​ చిత్రబృందం తిరుగు పయనమైంది. దాదాపు నెల రోజులుగా ప్రమోషన్స్​లో భాగంగా రాజమౌళి, కీరవాణి, రామ్​ చరణ్​, నిర్మాత శోభు యార్లగడ్డ, కాలభైరవ, రాహుల్​ సిప్లిగంజ్​ అమెరికాలో ఉన్నారు. కాస్త ఆలస్యమైనా ఎన్టీఆర్​ కూడా ఈ వేడుకల్లో భాగమవడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కాగా నేడు చిత్ర యూనిట్ సగర్వంగా హైదరాబాద్ లో అడుగుపెట్టారు.

శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజమౌళి, కీరవాణి, రమా రాజమౌళి, కాలభైరవ శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. తెల్లవారు జామున కూడా అభిమానులు జక్కన్న అండ్ టీం కి ఘనస్వాగతం పలకడం విశేషం. ఫ్యాన్స్ కేరింతలు కొడుతుండగా.. రాజమౌళి జై హింద్ అని వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడలేదు. ఎన్టీఆర్ ఇదివరకే హైదరాబాద్ చేరుకోగా.. నేడు రాంచరణ్ ప్రధాని మోడీతో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

ప్రపంచ స్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత గుర్తింపు పొందినప్పటికీ ఆస్కార్ పోటీలో తట్టుకుని నిలబడుతుందా అనే అనుమానాలు ఉండేది. ఎందుకంటే ఇండియన్ చిత్రాలకు ఆస్కార్ అవార్డు ఎప్పుడూ అంత సులభంగా దక్కలేదు. గతంలో ఇండియాకి ఆస్కార్ వచ్చినప్పటికి అది కొన్ని విభాగాల్లో మాత్రమే సాధ్యం అయింది. కానీ జక్కన్న అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. నాటు నాటు పాటకి పోటీగా ఆస్కార్ బరిలో హాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్స్ అయిన లేడి గాగా, పాప్ సింగర్ రియానా పాటలు కూడా నిలిచాయి. కానీ వాటిని బీట్ చేస్తూ నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించడం మైండ్ బ్లోయింగ్ ఫీట్ అనే చెప్పాలి. కొన్ని వారాలుగా ఆస్కార్ కోసం యుఎస్ లో గడిపింది ఆర్ఆర్ఆర్ టీం.