Manipur: ఆ పిల్ల‌లు ఏం త‌ప్పుచేసార‌ని చంపేసార‌య్యా..!

దాదాపు మూడు నెల‌ల పాటు అట్టుడికి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న మ‌ణిపూర్‌లో (manipur) మ‌రో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇద్ద‌రు టీనేజ్ పిల్ల‌ల్ని దారుణంగా హ‌త్య చేసారు.ఇద్ద‌రు దుండ‌గులు 17 ఏళ్ల బాలుడిని దారుణంగా చంపేసారు. బాలుడితో పాటు బాలిక‌ కూడా దారుణ హ‌త్య‌కు గురైంది. వీరిద్ద‌నూ జులై 6న క‌నిపించ‌కుండాపోయారు. వారికోసం పోలీసులు, త‌ల్లిదండ్రులు గాలిస్తున్నా ఆచూకీ దొర‌క‌లేదు.

నిన్న వీరిద్ద‌రి మృత‌దేహాల ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డంతో మ‌ణిపూర్ ఉలిక్కిప‌డింది. త‌న కుమారుడు తిరిగి వ‌స్తాడేమోన‌ని రోజూ ఉద‌యాన్నే టిఫిన్ చేసి రెడీగా పెడుతున్నాన‌ని ఇలా త‌న‌కు అంద‌నంత దూరం వెళ్లిపోతాడ‌ని అనుకోలేద‌ని బాలుడి తండ్రి క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. “” నా బిడ్డ కానీ.. వాడితో పాటు ఉన్న బాలిక కానీ ఏమైనా త‌ప్పు చేసారా? ఎవ‌రికైనా హాని త‌ల‌పెట్టారా? ఎందుకు చంపేసారు? వారిద్ద‌రూ క‌లిసి ఇంటికి వ‌స్తున్న స‌మ‌యంలో కిడ్నాప్ చేసి దారుణంగా చంపేసారు “” అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసారు.  (manipur)

కింది ఫోటోలో ఈ ఇద్ద‌రు పిల్ల‌ల వెన‌క ఉన్న మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు ఆయుధాలు ప‌ట్టుకుని నిల‌బ‌డి ఉన్నారు. వారే ఈ దారుణ హత్య‌కు పాల్ప‌డ్డార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. జులై 6న ఈ బాలిక నీట్ ఎగ్జామ్ ట్రైనింగ్ కోసం బ‌య‌టికి వచ్చింది. ఆ స‌మ‌యంలో క‌ర్ఫ్యూ కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని ట్రైనింగ్‌కి వెళ్లాల‌నుకుంది. బాలిక‌ను ఎక్కించుకుని వెళ్ల‌డానికి ఆ బాలుడు బైక్ వేసుకుని వ‌చ్చాడు. అంతా మామూలు అయిపోయింది అనుకుని ఎక్క‌డైతే దాడులు, హ‌త్య‌లు, కాల్పులు జ‌రిగాయో ఆ ప్ర‌దేశాల్లో (చూరాచండ్‌పూర్, బిష్నూపూర్) బైక్‌పై వెళ్లారు. జులై 6న సాయంత్రం వీరిద్ద‌రూ ఇంటికి వెళ్ల‌లేదు. దాంతో త‌ల్లిదండ్రులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

కొద్ది దూరం వెళ్లాక వారి ఫోన్లు స్విచాఫ్ అయిపోయాయి. వారు ఇంఫాల్ వైపు నుంచి బైక్‌పై వెళ్లిన‌ట్లు పోలీసులు సీసీటీవీ ద్వారా తెలుసుకున్నారు. అదే రోజు బాలిక తండ్రి ఫోన్ చేసిన‌ప్పుడు రింగ్ అయ్యింది. ఎక్క‌డున్నావ్ అని అడిగితే నంబోల్‌లోని ఖోపౌమ్ ప్రాంతంలో ఉన్నాన‌ని చెప్పింది. అప్ప‌టికే ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. జులైలో వీరి హ‌త్య జ‌రిగితే ఇప్ప‌టివ‌ర‌కు పోలీసులు క‌నిపెట్ట‌కుండా ఏం చేస్తున్నార‌ని మ‌ణిపూర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్ప‌గించారు. నిందితుల‌ను వ‌దిలిపెట్టే స‌మస్యే లేద‌ని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని మ‌ణిపూర్ సీఎం బిరేన్ సింగ్ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌ణిపూర్‌లో కుకి, మైతి తెగ‌ల‌కు చెందిన అల్ల‌ర్ల‌లో దాదాపు 180 మంది మృత్యువాత‌ప‌డ్డారు. (manipur)