TSPSC కీలక నిర్ణయం.. కొత్త ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు!
పరీక్ష పత్రాలు లీక్ అయిన ఘటనలో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిట్ అధికారుల దర్యాప్తులో ఉన్న ప్రవీణ్ తన పెన్‌డ్రైవ్‌లో రానున్న పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు భద్రపరుచుకున్న విషయం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇకపై జరుగబోయే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష మొదలుకొని మిగిలిన అన్ని పరీక్షలకు కొత్తగా మళ్లీ ప్రశ్నపత్రాలు సిద్ధం చేయాలని భావిస్తోంది. గతంలో ప్రశ్నల ఎంపిక కోసం నియమించుకున్న సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ను కూడా పక్కన పెట్టాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. వాస్తవానికి సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌కు సైతం ఒకరితో మరొకరికి సంబంధం ఉండదు. కానీ పరీక్ష పత్రాలు ఎక్కడి నుంచి లీకవుతున్నాయో తెలియని ప్రస్తుత తరుణంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ను సైతం మార్చాలని అనుకుంటున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. దీని కోసం ఇప్పటికే కొన్ని ప్రశ్నలతో ప్రశ్నపత్రాలు సిద్దం చేశారు. కానీ వాటిని కూడా మార్చి కొత్త ప్రశ్నపత్రాలను సిద్దం చేయనున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 23న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ), ఏప్రిల్ 25న అగ్రికల్చర్ ఆఫీసర్, ఏప్రిల్ 26, 27 తేదీల్లో గెజిటెడ్ ఆఫీసర్ (గ్రౌండ్ వాటర్), మే 7న డ్రగ్ ఇన్‌స్పెక్టర్, మే 13న పాలిటెక్నిక్ లెక్చరర్, మే 15, 16 తేదీల్లో నాన్ గెజిటెడ్ ఆఫీసర్ (గ్రౌండ్ వాటర్), మే 17న ఫిజికల్ డైరెక్టర్స్, జాన్ 5 నుంచి 12 వరకు గ్రూప్-1 మెయిన్స్, జూలై 1న గ్రూప్ -4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలతోపాటు ఇతర పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఈక్రమంలో ఏప్రిల్ 4 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. అయితే.. ఈ నెల 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో), 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. వీటిని ఎప్పుడు నిర్వహిస్తారు అన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.