ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ ఫ్యాన్స్​ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన కాలభైరవ!

ప్రతిష్టాత్మకంగా జరిగిన 95 అకాడమీ వేడుకల్లో ఆర్​ఆర్​ఆర్​ సినిమా ఆస్కార్​ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. బెస్ట్​ ఒరిజినల్​ స్కోర్​ కేటగిరిలో నామినేట్​ అయిన నాటు నాటు పాట ఆస్కార్​ దక్కించుకుంది. దేశమంతా ఆస్కార్​ సంబరాల్లో మునిగిపోతుంటే ఈ పాట పాడిన గాయకుడు కాలభైరవ మాత్రం ఫ్యాన్స్​ ఆగ్రహానికి గురయ్యాడు. ఆర్​ఆర్​ఆర్​ సినిమాలోని నాటు నాటు పాట విడుదలైనప్పటినుంచీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇక, తాజాగా ఈ పాటను ఆస్కార్​ వేదికపై గాయకులు రాహుల్​ సిప్లిగంజ్​, కాలభైరవ లైవ్​లో పాడారు. అయితే అంతర్జాతీయ వేదికపై పాట పాడిన సంతోషంతో కాలభైరవ చేసిన ట్వీట్​ కాస్తా బెడిసికొట్టింది. తన స్వరంతో ఆస్కార్​ సాధించిన కీరవాణి తనయుడు కాలభైరవ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. కాలభైరవ చేసిన ట్వీట్​పై ఎన్టీఆర్, రామ్​చరణ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. సోషల్​ మీడియా వేదికగా పెద్ద దుమారమే రేగింది. దాంతో తన ట్వీట్​పై వివరణ ఇస్తూ కాలభైరవ మరో ట్వీట్​ చేయడంతో సమస్య సద్దుమణిగింది. అసలు కాలభైరవ చేసిన ట్వీట్​ ఏంటంటే..

ఆస్కార్ వేదికపై ‘నాటునాటు’ పాట పాడిన కాలభైరవ ఇండియాకు తిరిగి వస్తూ.. ‘ఆస్కార్ అకాడమీ అవార్డుల స్టేజీపై లైవ్ లో ‘నాటు నాటు’ ప్రదర్శన ఇచ్చినందుకు ఎంతో గర్విస్తున్నాను.. రాజమౌళి బాబా, పెద్దమ్మ, అమ్మనాన్న, కార్తికేయ, ప్రేమ్ రక్షిత్ ఇలా వీరందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నాకు ఈ విలువైన అవకాశం దక్కేలా సాయం చేశారు. వాళ్ల శ్రమ, పనితనం వల్లే ఈ పాట ప్రపంచం నలుమూలలకు చేరింది. ఈ పాట పాడే అవకాశం నన్ను వరించింది. వారి కారణంగానే నేను ఈ అందమైన అనుభూతిని పొందగలిగాను. ఈ వాస్తవాన్ని ఎప్పటికీ మరిచిపోను. వాళ్ల విజయంలో నేనూ భాగమైనందుకు ఆనందిస్తున్నా’అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, రాంచరణ్ పేర్లను ప్రస్తావించకుండా కాలభైరవ ట్వీట్ చేయడాన్ని తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో వారందరికీ క్షమాపణలు చెబుతూ కాలభైరవ తాజాగా ట్వీట్ చేశాడు. తను చేసిన ట్వీట్ బయటవారికి మరోలా అర్థమైందని.. ఆస్కార్ స్టేజీపై ప్రదర్శన ఇవ్వడానికి తోడ్పడిన వారికి కృతజ్ఞతలు చెప్పానని.. మరో ఉద్దేశం తనకు లేదని, తన తప్పుంటే క్షమించమంటూ కాలభైరవ తాజాగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్​తో గొడవ కాస్తా సద్దుమణిగింది.