America లో కళ్లు చెదిరే అతిపెద్ద దేవాలయం
అగ్రరాజ్యం అమెరికాలో (america) కళ్లుచెదిరే అతిపెద్ద దేవాలయాన్ని అక్టోబర్‌లో తెరవనున్నారు. కళ్లుచెదిరేలా నిర్మించిన ఈ ఆలయంలో (temple) మొత్తం 13 ఆలయాలు ఉన్నాయి. న్యూజెర్సీలో ఉన్న టైమ్స్ స్క్వేర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 12 సంవత్సరాలు పట్టింది. 183 ఎకరాల్లో దీనిని నిర్మించారు. కంబోడియాలో ఉన్న అంగ్కోర్ వాట్ ఆలయం తర్వాత అతిపెద్ద ఆలయం ఇదే.
ఆల్రెడీ మనకు దేశ రాజధాని ఢిల్లీలో 100 ఎకరాల్లో అక్షరధామ్ ఆలయం ఉంది. ఇప్పుడు అమెరికాలో నిర్మించిన అతిపెద్ద ఆలయంలో స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ ఆలయం కూడా ఉంది. దీనిలో 10 వేల విగ్రహాలు ఉన్నాయి. భారతీయ సంగీత వాయిద్య పరికరాలు, నృత్యాలకు సంబంధించిన డిజైన్లతో ఈ విగ్రహాలను తయారుచేసారు. ఈ ఆలయం మొత్తంలో 18 శిఖరాలు ఉన్నాయి. లైమ్‌స్టోన్, గ్రెనైట్, పింక్ సాండ్ స్టోన్, మార్బుల్స్‌తో కలిపి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ రాళ్లను ఇండియా, టర్కీ, గ్రీస్, ఇటలీ, చైనాల నుంచి తెప్పించారు. ఈ ఆలయంలో ఓ బావిని కూడా నిర్మించారు. దీనికి బ్రహ్మ కుండ్ అని పేరు పెట్టారు. ఈ బావిలో నీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 300 నదుల నుంచి సేకరించారు. అక్టోబర్ 18న ఈ ఆలయాన్ని పర్యాటకుల సందర్శన నిమిత్తం తెరవనున్నారు.