కవిత అనుమానితురాలే.. కన్ఫామ్‌ చేసిన ఈడీ!

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తాము అనుమానితురాలిగానే భావిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రత్యేక కోర్టుకు స్పష్టం చేసింది. కవిత బినామీగా పేర్కొంటున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లై కస్టడీ ముగియడంతో గురువారం ఈడీ అధికారులు ఆయన్ను రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా కవిత ఈ కేసులో సాక్షా లేక అనుమానితురాలా? అని ఈడీని కోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఈడీ అధికారులు ప్రస్తుతానికి ఆమెను అనుమానితురాలుగానే భావిస్తున్నామని తెలిపారు. ఈక్రమంలో పిళ్లై కస్టడీని మరో అయిదు రోజులు పొడిగించాలని కోరారు. దీనికి స్పందించిన ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్‌.. పిళ్లై కస్టడీ పొడిగింపునకు అనుమతించారు. ఈ నెల 20న మధ్యాహ్నం మూడు గంటలకు పిళ్లైని కోర్టులో హాజరుపర్చాలని సూచించారు. అప్పటి లోగా ఆయన్ను పూర్తిస్థాయిలో విచారించాలని, సమయం వృథా చేయవద్దని ఈడీకి కోర్టు సూచించింది. ఇక అదేరోజు విచారణకు రావాలని కవితకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇద్దరిని ముఖాముఖిగా ఉంచి విచారించేందుకు ఈడీ అధికారులు సిద్దమవుతున్నారు.

ఈక్రమంలో కోర్ట పలు ప్రశ్నలను లేవనెత్తింది.. ప్రతి ఒక్కరితో ముఖాముఖిగా విచారించడం ఎందుకు? అని ఈడీని ఉద్దేశించి జడ్జి నాగ్‌పాల్‌ వ్యాఖ్యానించారు. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఈ నెల 24న విచారిస్తామని కోర్టు తెలిపిందని ఈడీ అధికారులు ప్రస్తావించగా… ‘‘24 తర్వాత ఆమె విచారణకు హాజరవుతారేమో… ఇప్పుడే విచారించాల్సినంత అత్యవసరం ఏముంది అని ప్రశ్నించింది.. ఆమె సమర్పించిన డాక్యుమెంట్లను అధ్యయనం చేయడానికి మీకు కూడా సమయం పడుతుంది కదా? మీరు ఇప్పటివరకు కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం కవిత బ్యాంకు ఖాతా నుంచి ఎటువంటి లావాదేవీలు జరగలేదని అర్థమవుతోంది అని అని జడ్జి అన్నారు. దీనికి ఈడీ తరపు న్యాయవాది స్పందిస్తూ.. నగదు ద్వారా లావాదేవీలు జరిగాయని, దీనిపై విచారించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. అరుణ్‌ పిళ్లైతో ముఖాముఖిగా కూర్చోబెట్టి విచారించడానికి గాను.. ఈ నెల 17న రావాల్సిందిగా బుచ్చిబాబుకు, 18న వైసీపీ ఎంపీ శ్రీనివాసులురెడ్డిని రావాల్సిందిగా, 20న కవిత విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.

పిళ్లై తరఫు న్యాయవాది మను శర్మ వాదిస్తూ.. సుదీర్ఘంగా ఈడీ కస్టడీకి పంపించడం సరికాదన్నారు. ఇతరులతో ముఖాముఖి కూర్చోబెట్టి విచారించాల్సినంత అవసరమేముందని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జడ్జి.. ‘‘ముఖాముఖిగా కూర్చోబెట్టి విచారించడం దర్యాప్తులో సమర్థవంతమైన పద్ధతి’’ అని వ్యాఖ్యానించారు. దీంతోపాటు పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరించుకోవడానికి అనుమతించాలంటూ పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌కు ఈడీ ఇచ్చిన సమాధానాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు రికార్డులోకి స్వీకరించింది. ఈ అంశంపై ట్రయల్‌ సమయంలో విచారిస్తామని పేర్కొంది. మరోవైపు, ఇదే కేసులో ఈడీ అరెస్టు చేసిన మాగుంట రాఘవరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.