“యావండీ.. మన అబ్బాయి BJPలో చేరిపోయాడు”
“” యావండీ.. ఏమీ అనుకోవద్దు. మన అబ్బాయి BJPలో చేరాడు. కాంగ్రెస్ పార్టీ అంటే వాడికి గౌరవమే కానీ BJPలో ఉంటే మన కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయనే అలా చేసాడు “” అంటూ ఓ మహిళకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ మహిళ ఎవరో కాదు.. కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ (ak antony) భార్య ఎలిజబెత్ (elizabeth). ఆంటోనీ ఎలిజబెత్‌ల కుమారుడు అనిల్ ఆంటోనీ BJPలో చేరాడు. ఎలిజబెత్ వీడియోను కేరళకు చెందిన క్రిస్టియన్ మెడిటేషన్ సెంటర్‌కు సంబంధించిన యూట్యూబ్ చానెల్లో రిలీజ్ చేసారు.
తాను రోజూ చర్చిలో ప్రార్థనలు చేయడం వల్లే అనిల్‌కి ప్రధాని కార్యాలయం నుంచి తమ పార్టీలో చేరాలని పిలుపు వచ్చిందని ఎలిజబెత్ వీడియోలో చెప్పడం వైరల్ అవుతోంది. కేరళ కాంగ్రెస్ డిజిటల్ కమ్యూనిటీ మెంబర్‌గా ఉన్న అనిల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో BJPలో చేరడమే కాకుండా తన తండ్రి ఉన్న కాంగ్రెస్ పార్టీని దూషించాడు. దాంతో ఆంటోనీ షాక్‌కు గురయ్యాడు. తన కుమారుడు వెన్నంటే ఉంటూ సాయపడతాడని అనుకుంటే ప్రతిపక్షంలో చేరి బాధపెట్టాడని ఆంటోనీ తెలిపాడు. ఇక ఆంటోనీ కూడా ఏమీ చేయలేక భయంతో ఇంటికి రాకుండా బయటే ఉంటున్న కొడుకు అనిల్‌ను త్వరలో ఇంటికి వచ్చేయాలని చెప్పాడు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఎలిజబెత్ వీడియో గురించి మాత్రం అటు ఆంటోనీ కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కానీ స్పందించలేదు.