India: కెన‌డావి ఆరోప‌ణ‌లే.. ఆధారాల్లేవ్..!

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ (hardeep singh nijjar) హ‌త్య‌లో భార‌త్ (india) హ‌స్తం ఉంద‌ని కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో (justin trudeau) ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీనిని భార‌త్ ఖండిస్తున్న‌ప్ప‌టికీ.. ట్రూడో త‌న మాట‌ను వెనక్కి తీసుకోన‌ని అంటున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు తాను చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆధారాల‌ను మాత్రం చూప‌లేక‌పోతున్నారు. ఇప్ప‌టికే ఇరు దేశాల మ‌ద్య స‌త్సంబంధాలు ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉన్నాయి.

ఇప్ప‌టికే భార‌త్‌కు సంబంధించిన అంత‌ర్గ‌త విష‌యాల్లో కెన‌డా దౌత్య‌వేత్త‌లు అవ‌స‌రం లేక‌పోయినా జోక్యం చేసుకుంటున్నార‌ని.. భార‌త్‌లో వారి సంఖ్య‌ను త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపింది. భార‌త్‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ ఇప్ప‌టికే జ‌స్టిన్ ట్రూడో కెన‌డాలో ప‌నిచేస్తున్న భార‌త రా అధికారిని బ‌హిష్క‌రించారు. దాంతో భార‌త్‌కు ఒళ్లుమండి ఇక్క‌డ ప‌నిచేస్తున్న కెన‌డా దౌత్యాధికారిని వారం రోజుల్లోగా తిరిగి కెన‌డా వెళ్లిపోవాల‌ని ఆదేశించింది.

అమెరికా ఏమంటోంది?

మ‌రోప‌క్క అగ్ర‌రాజ్యం అమెరికా (america) అటు ఇండియాకు (india) ఇటు కెన‌డాకు (canada) స‌పోర్ట్ చేస్తోంది. కెన‌డా భార‌త్‌పై ఆరోప‌ణ‌లు చేస్తోందంటే.. వాటికి సంబంధించిన విచార‌ణ‌లో భార‌త్ పూర్తిగా స‌హ‌క‌రించాల్సి ఉంటుందని.. తాము ఇరు దేశాల విష‌యంలో పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని తెలిపింది.

భార‌త్‌పై కెన‌డా ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డి ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా కేంద్రానికే స‌పోర్ట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శి థ‌రూర్ కెన‌డావి అబ‌ద్ధ‌పు ఆరోప‌ణ‌లు అంటూ ఖండించారు.