వడగండ్ల వానతో భీభత్సం.. తెలంగాణలో భారీ వర్షం
వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిన విధంగా గురువారం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒకవైపు వడగండ్ల వాన.. మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అప్పటి వరకు ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులకు గురైన హైదరాబాద్ వాసులు.. మధ్యాహ్నానికి చీకట్లు కమ్ముకుని భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో నగర వాసులు కొంత అసౌకర్యానికి గురయ్యారు.
వికారాబాద్, జహీరాబాద్‌లో వడగండ్ల వాన
వికారాబాద్, జహీరాబాద్‌లలో వడగండ్ల భారీగా కురిసింది. రానున్న అయిదు రోజుల పాటు వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి కారణంగా దక్షిణ, మధ్య తెలంగాణలో వర్షాలు భారీ పడవచ్చని అంటున్నారు. గురువారం వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వడగండ్ల వర్షం కురిసింది. పరిగి, పూడురు మండలాల పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షాలతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని చోట్ల ఆకాశంలో మెరుపులు.. మేఘాల గర్జనలకు జనం భయపడుతున్నారు. నగరంలోని గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, సోమాజీగూడ, అమీర్‌పేట, కూకట్పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకూ మరో ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రహదారిపైనే వడగళ్లు..
తెలంగాణలోని వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురు గాలులు, వడగండ్ల వాన కురుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్, మారేడుపల్లి, చిలకలగూడ, సీతాఫల్‌మండీ, అల్వాల్, తిరుమల గిరి, ప్యాట్నీ, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో భారీగా వడగళ్ల వాన కురిసింది. పలు చోట్ల రహదారులపై వడగళ్లు పేరుకుపోయాయి.
రైతులకు తీవ్ర నష్టం..
వడగండ్ల వాన, ఈదురు గాలులతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లో ప్రమాదం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా కంది, మామిడి, వరి, ఇతర పంటలపై వర్షాల ప్రభావం ఉంటుందని అంటున్నారు. వడగండ్ల వాన, ఈదురు గాలులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని వారు చెబుతున్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.