సుప్రీంలో కవితకు చుక్కెదురు!

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. చార్జ్​షీట్​లోనూ కవిత పేరు ఉండటంతో ఈ స్కామ్​తో ఆమెకు సంబంధాలున్నాయనే వాదన వినిపిస్తోంది. తాజాగా కవిత ఈడీ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే రెండో విడత విచారణ హాజరు కాకుండా మినహాయింపు పొందేందుకు ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. తాను ఒక మహిళనని, తనను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడం సరికాదని సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్‌ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకుంటున్నట్లు సీజేఐ ధర్మాసనం తెలిపింది. అయితే ఈడీ విచారణపై స్టే ఇవ్వడానికి మాత్రం నిరాకరిచింది. ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది. దీంతో కవిత విచారణకు హాజరు కాకూడదని చేసిన ఆఖరు ప్రయత్నం కూడా ఫలించలేదు. దీంతో కవిత ఈనెల 16న ఈడీ విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందే.
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈనెల 11న కవితను సుమారు 9 గంటలపాటు విచారణ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు మద్యం కుంభకోణంతో గల సంబంధాలపై ఆరా తీసింది. 16న జరిపే విచారణలో ఈ కేసులో ఏ1 నిందితుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియా, మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై, కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబుతో కలిపి విచారణ చేసే అవకాశం ఉంది.