పేపర్ లీకేజీ ఘటనపై TSPSC ఛైర్మన్ ప్రెస్ మీట్!
మూడు రోజులుగా TSPSC పేపర్ లీకేజీ ఘటన తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేపర్ లీక్ ఘటనపై వస్తున్న వదంతులపై వివరణ ఇచ్చేందుకే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామన్న ఆయన ఘటనకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ‘ఏఈ పరీక్ష మీద తుది నిర్ణయం ఈరోజు తీసుకుంటాం. 30 లక్షల మంది వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌ను యూపీఎస్సీ కూడా మెచ్చుకుంది. ఏపీపీఎస్సీ ఉన్న సమయంలో ఏటా నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేసేవారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏడాదికి సుమారు 35 వేల ఉద్యోగాల భర్తీ అవుతున్నాయి.
ప్రస్తుతం సుమారు 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ అనేక నూతన విధానాలను తీసుకొచ్చాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం దేశంలో ఎక్కడా లేనట్టుగా జంబ్లింగ్ చేశాం. అక్రమాలకు ఆస్కారం ఉండకూడదనే జాగ్రత్తలు తీసుకున్నాం. అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగిందని, అభ్యంతరాల స్వీకరణకు ఐదు రోజులు సమయం ఇచ్చాం. నిపుణులను సంప్రదించాకే.. గ్రూప్ 1 ఫైనల్ కీ ఇచ్చాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ వడపోత పరీక్ష మాత్రమే. అందుకే మార్కులు ఇవ్వలేదు. టౌన్ ప్లానింగ్ పరీక్షకు ముందు రోజు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసుల దర్యాప్తులో తొమ్మిది మంది నిందితులుగా తేల్చారు. అయితే ఐపీ అడ్రెస్ లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కు తెలిసే అవకాశం ఉంది. రాజశేఖర్ ముఖ్యమైన సమాచారం యాక్సెస్ చేసినట్టుగా అనుకుంటన్నాం. రాజేశేఖర్ సాయంతో ఏఎస్ఓ ప్రవీణ్ పేపర్లు తీసుకున్నాడు. ప్రవీణ్ రూ.10 లక్షల కోసం పేపర్లు అమ్మాడని తెలిసింది. లీకేజీ పరిణామాల కారణంగా అత్యవసర భేటీ నిర్వహించాం. నా కుమార్తె ప్రిలిమ్స్ రాసిందనే వార్తల్లో నిజం లేదు. ఏఈ పరీక్ష మీద బుధవారం నిర్ణయం తీసుకుంటాం. ప్రవీణ్ కు మాత్రం గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 103 మార్కులు వచ్చిన మాట నిజమే. కమిషన్‌లో నమ్మిన వాళ్లే గొంతు కోశారు. గ్రూప్1 మెయిన్స్ జూన్ 5 నుంచే నిర్వహిస్తాం. ఎగ్జామ్ లో విజేతలు కాని వారు కోర్టులకు వెళ్లడం సాధారణమే. మా సమయం కోర్టు కేసులతో సరిపోతోంది. లీకేజీ వ్యవహారం మీద పోలీసులు వేగంగా స్పందించారు. లీకేజీలో ప్రమేయం ఉన్న వారి ఉద్యోగాలు పోతాయి. ప్రవీణ్, రాజేశేఖర్, రేణుక, రేణుక భర్త ఉద్యోగాలు ఉండవు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక.. అసలు నిజం తెలుస్తుంది’ అని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి పేపర్ లీకేజీ ఘటనపై వివరణ ఇచ్చారు.