Inter Exams: గూగుల్‌ని న‌మ్మి మోసపోయిన విద్యార్థి.. పరీక్ష రాయకుండానే ఇంటికి!

ప్రస్తుతం సాంకేతికత పెరిగింది. అందరి చేతుల్లోనూ యాండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరి సాయంతో పనిలేకుండా గూగుల్‌ మ్యాప్స్‌ పెట్టుకుని గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇలాగే ఓ ఇంటర్‌ విద్యార్థి గూగుల్‌ తల్లిని నమ్ముకుని మోసపోయాడు. ఇవాళ్టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి పరీక్ష రాసేందుకు బయలుదేరి… పరీక్ష కేంద్రం అడ్రెస్‌ కోసం గూగుల్‌ మ్యాప్‌ పెట్టుకున్నాడు. చివరికి అతనికి కేటాయించిన చిరునామాకి కాకుండా వేరే పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. అప్పటికే సమయం మించిపోవడంతో హుటాహుటిన తన పరీక్ష కేంద్రం గురించి తెలుసుకుని అక్కడి వెళ్లగా.. అప్పటికే సమయం మించిపోయింది. దీంతో పరీక్ష రాసేందుకు అతన్ని అనుమతించలేదు.

పూర్తి వివరాలు ఇలా..
ఖమ్మం జిల్లాలోని కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. బుధవారం ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కావడంతో ఎగ్జామ్‌ హాలుకు వెళ్లేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకున్నాడు. అందులో చూపించిన డైరెక్షన్‌లో వెళ్లాడు. అయితే తాను వెళ్లాల్సిన లొకేషన్‌కు కాకుండా మరో ప్లేస్‌కు గూగుల్‌ మ్యాప్స్‌ తీసుకెళ్లింది. అక్కడ ఎగ్జామ్‌ సెంటర్‌ లేకపోవడంతో హడావుడిగా వేరేవాళ్లను అడ్రస్‌ అడుగుతూ… అతనికి కేటాయించిన పరీక్ష కేంద్రానికి వచ్చాడు. ఈ క్రమంలో వినయ్‌ 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకున్నాడు. అయితే నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ అని ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఈక్రమంలో వినయ్‌ను పరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక బాధతో ఇంటికి వెనుదిరిగాడు.

ఇంటర్ పరీక్ష కేంద్రం.. గేటుకు తాళం
ఏపీలో కూడా ఇవాళ మొదటి సంవత్సరం ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కళాశాల గేటు తీయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండడంతో చిన్న సందులో నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. గేటుకు తాళం వేసిన వాచెమెన్‌ ఎక్కడికో వెళ్లాడని.. తాళం చెవి అతని దగ్గరే ఉంటడంతో అతని కోసం వెతుకుతున్నామని సమాధానం చెప్పారు. దీంతో విద్యార్థులు కొంత గందరగోళానికి గురయ్యారు.

గంట ముందే చేరుకోవాలంటున్న నిపుణులు..
ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముందు వెళ్లడం వల్ల పరీక్ష రాసే సమయంలో విద్యార్థులు ఒత్తిడి పడవలసి ఉండదని అంటున్నారు. దీంతోపాటు అడ్రెస్‌ తెలియకపోయినా.. కొంత సమయం ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకుండా నిర్ణీత సమయానికి చేరుకోవచ్చని చెబుతున్నారు. ఇక రేపటి నుంచి ద్వితీయ సంవత్సర ఇంటర్‌ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తుల తీసుకోవాలని అంటున్నారు.