G20 Summit: ముగిసిన సదస్సు
దేశ రాజధాని ఢిల్లీలో నిన్న, ఈరోజు జరిగిన జీ20 శిఖరాగ్ర (g20 summit) సదస్సు నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. (narendra modi) బ్రెజిల్ అధ్యక్షుడు లూయి ఇనసియో లూలా దసెల్వాకు ప్రెసిడెన్సీ బ్యాటన్‌ను అందజేసారు. అంటే.. ఈఏడాది భారత్‌లో జీ20 సమ్మిట్ జరిగింది కాబట్టి.. తర్వాత జీ20 సమ్మిట్ బ్రెజిల్లో జరుగుతుంది. ఏ దేశంలో జీ20 సదస్సు జరిగితే.. ఆ దేశ అధ్యక్షుడు కానీ ప్రధాని కానీ.. జీ20లో భాగమైన మరో దేశాధ్యక్షుడికి కానీ ప్రధానికి కానీ బ్యాటన్ (చెక్కతో తయారుచేసిన సుత్తి లాంటిది) ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఇప్పుడు మోదీ.. బ్రెజిల్ అధ్యక్షుడి చేతికి బ్యాటన్ ఇచ్చారు కాబట్టి తర్వాత శిఖరాగ్ర సదస్సు ఆ దేశంలో జరుగుతుందని అర్థం. (g20 summit)
కీలక అంశాలు
*నిన్న జరిగిన సదస్సులో ఒకే భూమి ఒకే కుటుంబం అనే అంశంపై ఎన్నో చర్చలు జరిపినట్లు మోదీ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి భవిష్యత్తుకు బాటలు వేసే వేదికగా జీ20 సదస్సు మారినందుకు సంతోషంగా ఉందని అన్నారు.
*బ్రెజిల్ అధ్యక్షుడు దసెల్వా మోదీకి అభినందనలు తెలుపుతూ.. రాజకీయ బలం కోసం జీ20లో ఉన్న దేశాలను ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషల్ మానిటరీ ఫండ్ సంస్థల వద్ద అధిక ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రాజకీయ బలం పుంజుకోవడానికి కొత్తగా అభివృద్ధి చెందుతున్న దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
*ఈ శిఖరాగ్ర సదస్సులో కీలక అంశం ఏదైనా ఉందంటే అది గ్లోబల్ ట్రస్ట్ డెఫిసిట్. అంటే దేశాల మధ్య తగ్గుతున్న నమ్మకాలు. ఆ నమ్మకాలను పెంచుకోవడానికే గ్లోబల్ ఫ్యుయల్ అలయన్స్ అనే గ్రూప్‌ను తీసుకొచ్చారు. అంతేకాకుండా భారత్, అమెరికా, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు, అరబ్ రాష్ట్రాలు, ఐరోపాల మధ్య రైళ్లు, ఓడల కనెక్టివిటీని ఏర్పాటుచేయాలని డీల్ కుదుర్చుకున్నారు.
*ఢిల్లీ డిక్లరేషన్‌పై అన్ని దేశాలు ఏకీభవించినప్పటికీ.. ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యాను మాత్రం నేరుగా ఖండించలేదు. ఈ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఉక్రెయిన్ అంత సంతృప్తిగా లేదు. ఉక్రెయిన్ దేశానికి చెందిన వారు సదస్సులో ఉండి ఉంటే వారికి ఈ డిక్లరేషన్ గురించి మరింత తెలుసుకునే అవకాశం ఉండేదని ఉక్రెయిన్ అభిప్రాయపడింది.
*2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక శక్తిని (సౌర, పవన శక్తి ) మూడు రెట్లు ఎక్కువగా ఉత్పత్తి చేయాలని సమ్మిట్‌లో నిర్ణయించారు. విద్యుత్తు ఉత్పత్తికి వీలైనంత తక్కువ బొగ్గును వాడాలని, కానీ దేశ ఆర్థిక వ్యవస్థను బట్టి ఎంత వరకు బొగ్గును వాడగలరు అనేది ఆధారపడి ఉంటుందని తెలిపారు.
*2009లో జీ20 దేశాలు కలిసి పిట్స్‌బర్గ్‌లో నిర్ణయించినట్లుగా పర్యావరణానికి హాని కలిగించే శిలాజ ఇంధనాలకు అనవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం మానేయాలన్న హామీని నెరవేర్చి తీరతామని అన్నారు.