‘TSPSC పరీక్షా పత్రాలన్నీ లీక్.. ఇదిగో సాక్ష్యం’
కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీక్ అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆరోపించారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షా పత్రం సైతం లీక్ అయ్యిందనీ, టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంతోపాటు తానే స్వయంగా పరీక్ష రాశారని అన్నారు. అందువల్లే ప్రవీణ్‌కు అత్యధికంగా 103 మార్కులొచ్చాయని.. అందుకు సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను రిలీజ్ చేశారు సంజయ్. ప్రవీణ్ కోసం పరీక్షా సమయాన్ని సైతం మార్చారని.. అభ్యర్థులందరికీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పరీక్ష నిర్వహిస్తే ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి మాత్రం మధ్యాహ్నం తరువాత నిర్వహించారని అన్నారు. దీనివెనుక పెద్ద మతలబు ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంతులేని రీతిలో కొనసాగుతోంది. ఉద్యోగాలకున్న డిమాండ్ రీత్యా ఎలాగైనా పోటీ పరీక్షల్లో తమకు అనుకూలమైన వాళ్లు నెగ్గాలన్న తాపత్రయంతో చేసే తప్పిదాలతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరం. మున్సిపాలిటీల పరిధిలో పని చేసే అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల మంది అభ్యర్ధులు పాల్గొన్నారు. కానీ పరీక్షపత్రం లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. దీంతోపాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు సమాచారం అందుతోంది. ఇవి మాత్రమే కాకుండా గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు స్పష్టమైన ఆధారాలు కన్పిస్తున్నాయి. గతంలో కూడా ఇటువంటి లీకేజీలు పెద్ద ఎత్తున జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంతో లీకేజీ వీరులు చెలరేగిపోతున్నారు. 2018లో పదో తరగతి పరీక్షల సమయంలో పరీక్ష పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా లీక్ కావటం, ఎంసెట్ పశ్నాపత్రాల లీకేజీ వాట్సప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావటం విద్యార్ధుల్లోనూ తల్లితండ్రుల్లోనూ ఆందోళనకు దారితీసింది. లేనిపోని నిబంధనల పేరుతో కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల్లోనూ అనేక అవకతవకలు జరిగిన విషయం సైతం అనేక ఆందోళనలకు తావిస్తోంది..’ అన్నారు బండి సంజయ్.