అందువల్లే సుస్మితా సేన్​ కోలుకోగ‌లిగింది: వైద్యుడి వ్యాఖ్య‌లు

మాజీ విశ్వసుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ఇటీవలే తీవ్రమైన గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమె గుండెకు రక్తాన్ని పంపించే నాళాలు 95 శాతం బ్లాక్ అయ్యాయి. దాదాపు చావు అంచుల వరకు వెళ్లిన ఆమె దేవుడి దయ వల్ల బతికినట్లు ఆమే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో పేర్కొన్నారు. అయితే సుస్మితా సేన్​ క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వల్లే ప్రమాద తీవ్రత తగ్గిందని ఆమెకు చికిత్స అందించిన ప్రముఖ కార్డియాలజిస్ట్​ డాక్టర్ రాజీవ్ భగవత్ అన్నారు. సరైన సమయంలో చికిత్స అందడం వల్లే సుస్మిత బతికిందని లేకపోతే కచ్చితంగా ప్రాణాపాయం ఉండేదని తెలిపారు. ఇకనైనా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మధుమేహం, ఊబకాయం, విటమిన్​ డి లోపం, నిద్రలేమి గుండె జబ్బులకు దారి తీస్తాయని అన్నారు. వరుసగా సంభవిస్తున్న ఘటనలు ఒక రిమైండర్​లా పరిగణించి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుండె సంబంధ సమస్యలకు స్త్రీ, పురుష భేదం ఉండదని, అందరూ జాగ్ర్తతలు పాటించి తగిన ఆహారం తీసుకుంటూ ఒత్తిడి, ఆందోళలను తగ్గించుకోవాలన్నారు.

ప్రపంచ విశ్వసుందరిగా కిరీటం పొందిన సుస్మితా సేస్ ‘వాస్తు శాస్త్ర’, ‘పైసా వసూల్’, ‘ నో ప్రాబ్లమ్’, ‘నాయక్’ వంటి సినిమాలతో పాపులర్​ అయ్యారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఆ తరువాత ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్లాట్ ఫాం మీద మెరిశారు. ఇటీవల సుస్మితాసేన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సంబంధీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రమాదం తప్పింది. కోలుకున్న తర్వాత ఓ వీడియో ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని అభిమానులతో పంచుకున్న సుస్మిత ఎమోషనల్​గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యాను. గుండెకు సంబంధించిన ప్రధాన రక్తనాళం 95 శాతం బ్లాక్ అయింది. ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నా. ఇక్కడి వైద్యలు ఎంతగానో శ్రమించి నన్ను కాపాడారు. అయితే చికిత్స తీసుకుంటున్న సమయంలో ఎవరికీ చెప్పొద్దని అనుకున్నా.. ప్రస్తుతం కోలుకున్నాకే అందరికీ చెప్పాలనీ ఈ వీడియో పోస్టు చేశా. దీంతో అందరూ నాకు గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నా పై ప్రేమ చూపిస్తున్న వారికి థ్యాంక్స్ ’ అని వీడియో సందేశం ఇచ్చారు సుస్మితా సేస్​.