లోపాయికారీ ఒప్పందాలకు పవన్ స్పెషలిస్ట్ – పేర్ని నాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్‌లో ఆదివారం నాడు కాపు సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైసీపీ పార్టీతోపాటు, కాపు సామాజిక వర్గం గురించి పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈనేపథ్యంలో పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం తాడేపల్లిలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాపులు గుండెల్లో పెట్టుకున్నారని మాజీమంత్రి పేర్ని నాని చెప్పారు. 2024, 2029లోనూ కాపులు జగన్ కే పట్టం కడతారని స్పష్టం చేశారు. కాపుల కోసం పవన్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశాడు. కులాలపైనా పవన్‌కు కనీస అవగాహన లేదని.. రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే.. ఏటా పవన్‌కే ఇవ్వాలని ఎద్దేవా చేశారు. మరో ఏడాదిలో జనసేన అధినేత అన్ని రంగులు బయటపడతాయని అన్నారు.
లోపాయికారీ ఒప్పందాలకు పవన్ స్పెషలిస్ట్ అని పేర్ని నాని విరుచుకుపడ్డారు. తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబుతో పవన్ పోటీపడుతున్నాడని దుయ్యబట్టారు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేందుకే పవన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడరని విమర్శించారు. చంద్రబాబు ప్రాపకం కోసం ప్రభుత్వంపై పవన్ విషం చిమ్ముతున్నాడు’ అని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తన కులం వాళ్లు ఓటేస్తే నేను ఓడిపోయేవాడినే కాదని పవన్ అంటున్నాడు.. అసలు రాజకీయ నేతకు, ప్రజా నాయకుడికి ఏ కులం అయితే ఏంటని ప్రశ్నించారు. ఒక్క కులం ఓట్లు వేస్తే చట్టసభలకు వెళ్లాలని అనుకుంటారా అని ప్రశ్నించారు. ఒక్క కులం ఓట్లతో కుల నేత అవుతారు.. ప్రజా నేత కాలేరని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు బాగుండాలనేదే పవన్ కల్యాణ్ అంతిమ లక్ష్యమని పేర్ని నాని ఆరోపించారు.