Oscar: ఎన్టీఆర్​ ఎమోషనల్​ పోస్ట్​!

95వ అకాడమీ అవార్డుల్లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ఆస్కార్ గెలుచుకుని భారతదేశ సినీ చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని లిఖించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్​ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా చిత్రబృందానికి అభినందనలు తెలుపుతోంది. దేశంలోని రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆర్​ఆర్​ఆర్​ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీమ్​ నటించిన జూనియర్ ఎన్టీఆర్ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘మేం ఆస్కార్‌ సాధించాం. కీరవాణి గారికి, ఎస్ఎస్. రాజమౌళి, చంద్ర బోస్, చిత్ర బృందంతో సహా దేశం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’ అని జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్​ చేశారు. అలాగే ‘ఆస్కార్ గెలుచుకున్న మొదటి ఇండియన్ డాక్యుమెంటరీగా మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఈ విధంగానే మీరు మరిన్ని కథలను చెప్పాలనుకుంటున్నాను. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ బృందానికి నా శుభాకాంక్షలు’ అంటూ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్ర బృందాన్ని అభినందించారు.

ఆస్కార్​ వేడుకల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లినప్పటినుంచీ తారక్​ స్థానిక మీడియాతో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని భారతదేశ విశిష్టతను చాటుతూనే ఉన్నారు. అదే విధంగా ఆస్కార్​ అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన తారక్​ దేశ గొప్పతనం గురించి మరోసారి చెప్పుకొచ్చారు. ‘భారత్ భిన్నమైన దేశం. ఇండియాలో అనేక సాంస్కృతిక సంప్రదాయాలున్నాయి.ఈ సాంప్రదాయాలనే మీరు ‘ఆర్ఆర్ఆర్’ లో చూస్తారు. అందువల్ల ప్రపంచానికి అనేక కథలను చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండియా నుంచి అనేక భావోద్వేగాలతో కూడిన స్టోరీలను చూడవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ తో ఫిల్మ్ మేకర్స్‌కు అందరికి ఆత్మవిశ్వాసం వస్తుంది’ అన్నారు. ఇక వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత సంప్రదాయాన్ని ఇనుమడించేలా డిజైనర్​ దుస్తులను ధరించారు ఎన్టీఆర్​. అంతేకాదు.. ప్రతి అవుట్​ఫిట్​లోనూ కొమురం భీమ్​ పాత్ర ప్రతిబింబించేలా డిజైన్​ చేశారు ప్రముఖ డిజైనర్​ గౌరవ్​ గుప్త. ​
ఆర్ఆర్ఆర్ ఆస్కార్​ కంటే ముందే ముందే అనేక అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకుంది. హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డును గెలుపొందింది. ప్రతి ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని సాధించింది. గోల్డెన్ గ్లోబ్స్‌లోను ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ అందించారు. చంద్రబోస్ రచించగా రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఈ పాటని ఆలపించారు.