కర్నూల్లో సమాజం తలదించుకునే సంఘటనలు.. ఇంత దారుణమా?
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ కామాంధుడు.. ఆసుపత్రిలోని బాత్రూంలో మహిళ స్నానం చేస్తుండగా.. ఆ దృశ్యాలను గోడెక్కి చిత్రీకరించిన సంఘటన కలకలం రేపింది. కర్నూలులోని ఓ ఆసుపత్రిలో జరిగిన ఇలాంటి ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం కర్నూలు నగరంలోని సర్వజన ఆస్పత్రిలో చోటుచేసుకోగా.. నిందితుడిని ఆసుపత్రిలోని రోగుల బంధువులు గుర్తించి చితకబాదారు.
అసలేం జరిగిందంటే..
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్వకాల్వకు చెందిన ఏలియా అనే వ్యక్తి తన స్నేహితుడిని చూసేందుకు ఆసుపత్రికి వచ్చారు. ఆ సమయంలో తోటి రోగి సహాయకురాలు బాత్రూంలో స్నానం కోసం వెళ్లింది. దీన్ని గమనించిన ఏలియా బాత్రూం గోడమీదికి ఎక్కి తన సెల్ ఫోన్లో ఆమె నగ్న వీడియోను తీశాడు. అది గమనించిన ఆమె… గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించారు. అతన్ని అక్కడే పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆస్పత్రి సిబ్బంది సహాయంతో అతన్ని పోలీసులకు అప్పగించారు.
రెండు వారాల కింద..మరో ఘటన ఇలా..
కర్నూలు జిల్లాలో మరో దారుణమైన ఘటన రెండు వారాల కింద వెలుగు చూసింది. తన ప్రియురాలిని నగ్న వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతున్నవ్యక్తిని ఓ యువకుడు హతమార్చాడు. కర్నూలు మండలం బాలాజీ నగర్ కు చెందిన ఎరికలి దినేష్, మల్లెపోగు మురళీకృష్ణ (22) ఇద్దరూ స్నేహితులు. మురళీకృష్ణ పూల అలంకరణలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దినేష్ గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈనేపథ్యంలో ఆ యువతి నగ్న వీడియోలు తీశాడు. ఈ విషయం తెలుసుకున్న మురళీకృష్ణ… దినేష్ ఫోన్లోని ఆ నగ్న వీడియోలను తన ఫోన్లోకి పంపించుకుని ఆ యువతికి చూపించి.. వేధింపులకు దిగాడు. తాను చెప్పినట్టు వినకపోతే ఆ వీడియోలను బంధువులకు, కుటుంబ సభ్యులకు పంపుతానని మురళీకృష్ణ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె ఇటీవల ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న దినేష్.. మురళీ కృష్ణపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని చంపాలని నిర్ణయించుకుని… కిరణ్ కుమార్ అనే మరో స్నేహితుడి సహాయంతో హత్యకు ప్లాన్ వేసుకున్నాడు. జనవరి 25న మురళీకృష్ణను బైక్ మీద ఎక్కించుకుని.. నగర శివారులోకి వారు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత దినేష్, కిరణ్ కుమార్ లు మురళీకృష్ణ మీద కత్తితో దాడి చేసి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో పడేశారు. మురళీ బంధువులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు నిందుతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.