‘నేను ఓడిపోతే మీసాలు మెలేసింది.. తొడ కొట్టింది వాళ్లే’ – ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫైర్

2019 ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం, గాజువాక‌లో తాను ఓడిపోయిన త‌ర్వాత.. కొంద‌రు మీసాలు మెలేశార‌ని.. తొడలు కొట్టార‌ని.. వారంద‌రూ ఊడిగం చేసే కాపులేన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫైర్ అయ్యారు. జ‌న‌సేన ఆవిర్భావ స‌భ స‌న్నాహాల్లో భాగంగా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో కాపు సంక్షేమ సంఘం నాయ‌కుల‌తో జ‌న‌సేనాని ఆదివారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాపులంద‌రూ త‌న‌కు ఓట్లు వేసి ఉంటే.. పోటీ చేసిన రెండు చోట్ల తాను గెలిచే వాడిన‌ని.. కానీ గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌లోభాల‌కు లొంగిపోవ‌డంతో తాను ఓడిపోయాన‌ని ప‌వ‌న్ తెలిపారు. కాపు సమూహానికి నిజంగా కట్టుబాటు ఉంటే ఇతరులు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండ‌ద‌న్నారు. వ్య‌క్తులు చనిపోయాక విగ్రహాలు, జిల్లాల పేర్లు పెడితే ప్రయోజనమేంటి? రంగా నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఒక్కో ఊరి నుంచి కనీసం వంద మంది వచ్చి ఉంటే ఆయనపై దాడి జరిగేదా? నాయకులు బతికున్నప్పుడు వెంట నిల్చోకుండా చనిపోయాక దండలేస్తే ఏం ప్రయోజనం? అని ఆయ‌న ప్రశ్నించారు. అంతకుముందు జ‌న‌సేన పార్టీలోకి ఒంగోలు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేలు ఈదర హరిబాబు, టీవీ రామారావులు, భీమిలి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కులు చేరారు.

ప్యాకేజీపై మ‌రోసారి స్పందించిన ప‌వ‌న్‌..
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప‌వ‌న్‌కు వెయ్యి కోట్లు ఆఫ‌ర్ చేశార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై జ‌న‌సేనాని స్పందించారు. డ‌బ్బుతో పార్టీని న‌డ‌పాల‌ని తాను రాజ‌కీయాల్లోకి రాలేద‌న్నారు. సైద్ధాంతిక బలంతోనే లక్షల మందిని ఏకాభిప్రాయానికి తీసుకురావొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఒకరు రూ. వెయ్యి కోట్లకు మాట్లాడేశామంటారు.. అలా వెయ్యి కోట్లతో రాజకీయం నడపొచ్చంటే అంతకు మించిన జోక్ ఏమైనా ఉంటుంద‌నా అని ఎద్దేవా చేశారు. సైద్ధాంతిక బలం లేకుండా పది వేల కోట్లు ఇచ్చినా పార్టీని నడపలేమ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. మ‌రోవైపు కాపుల్లో కట్టుబాటు రావాల‌ని… అధికార బదలాయింపునకు పెద్దన్న పాత్ర పోషించి బీసీ, ఎస్సీ సమూహాలను దగ్గరకు తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. అవ‌స‌ర‌మైతే అగ్రవర్ణాలతో సహా అన్ని కులాలను సమానంగా చూసుకునే తాత్వికతను సమకూర్చుకోవాల‌న్నారు. కాపులను బీసీలు, దళితులకు వ్య‌తిరేకంగా కొన్ని పార్టీలు చిత్రీకరిస్తున్నాయ‌ని అవి వాస్త‌వం కాద‌ని నిరూపించాల‌న్నారు. కోస్తాలోని కాపులు గొంతెత్తగలర‌ని… రాయ‌ల‌సీమ‌లో బలిజలు గొంతెత్తాలంటే భయపడతార‌న్నారు. దీనికి దైర్యం, తెగింపు లేకపోవడం కారణం కాద‌ని.. ఐక్యమ‌త్యం లేకపోవడమేన‌ని అన్నారు. మనం ముందుండి యుద్ధం చేస్తుంటే వెనుకనుంచి పొడిచే మనవాడి వల్లే ఈ పరిస్థితి ఏర్ప‌డిందని అన్నారు.

సంఖ్య బ‌లం ఉంది.. అధికారం పంచుకోక త‌ప్ప‌దు..

కాపులకు సంఖ్యా బ‌లం ఉంది. అధికారాన్ని పంచుకోక త‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని ఇత‌ర పార్టీల‌కు తెల‌య‌జేసే ప్ర‌య‌త్నం త‌న వంతుగా చేస్తాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. వాస్తవిక ధోరణితో చెప్పాల‌ని.. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా దేహీ అనాల్సిన పరిస్థితిలో ఎందుకున్నామో అంద‌రూ ఆత్మపరిశీలన చేసుకోవాల‌ని అన్నారు. జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించబోనని పవన్ స్పష్టం చేశారు. తెలుగుదేశం 20 సీట్లకే జ‌న‌సేన‌ను పరిమితం చేస్తున్న‌ట్లు ప్ర‌చారం చేసుకుంటోందని.. తాను ఎప్పుడూ లోపాయికారీ ఒప్పందాలు చేసుకోన‌న్నారు.

ప‌వ‌న్ వెంటే కాపులు – హరిరామజోగయ్య
కాపు ఉద్య‌మ‌నేత హ‌రిరామ‌జోగ‌య్య మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎవరితో కలిసి ప్రయాణించినా కాపులు పవన్ వెంటే ఉంటార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ రెచ్చకొడుతున్న టీడీపీ … జనసేనను బద్నాం చేస్తోంద‌న్నారు. కన్నా లక్ష్మీనారాయణలాంటి కాపు నేతలు జనసేనలో చేరకుండా అడ్డుకుని బలహీనపరుస్తోంద‌న్నారు. జనసేనతో తెదేపాకు లోపాయికారీ ఒప్పందం కుదిరినట్లు, 20 సీట్లను పార్టీకి కేటాయించినట్లు, ఇందుకుగాను చంద్రబాబును సీఎంగా అంగీకరించినట్లు తెదేపా వారు ప్రచారం చేస్తున్నార‌ని.. వైకాపా, తెదేపాలపై పవన్ యుద్ధం ప్రకటించాలి’ అని హరిరామజోగయ్య కోరారు. ప్రతిపక్షంలో ఉండగా బీసీలకు నష్టం కలగని విధంగా కాపులకు రిజర్వేషన్లను పరిశీలిస్తామని జగన్ హామీనిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మర్చిపోయార‌ని ఆయ‌న పేర్కొన్నారు.