హోరాహోరీగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉద‌యం 8 గంట‌ల నుంచే ప్రారంభమైంది. ఏపీలో మాత్రం ఈ ఎన్నిక‌ల‌ను అటు అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ, వామ‌ప‌క్షాలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. దీంతో ప‌లు చోట్ల ఈ ఎన్నిక హోరాహోరీగా జ‌ర‌గ‌నున్నాయి. ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగుతుంద‌ని ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారులు తెలిపారు.

ఎక్క‌డెక్క‌డ ఎన్నిక‌లంటే..
ఏపీలోని మూడు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ జ‌రుగుతోంది. తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే.. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు.. పశ్చిమగోదావరిలో రెండు చోట్ల‌, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కోస్థానంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు శ్రీకాకుళం-విజయనగరం -విశాఖపట్నం క‌లిపి ఉత్ర‌రాంధ్ర జోన్‌గా.. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు మ‌రో జోన్‌, కడప-అనంతపురం-కర్నూలు రాయ‌ల‌సీమ జోన్‌గా ఆయా స్థానాల్లో పోలింగ్ జ‌ర‌గుతోంది. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల‌కు క‌లిపి పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ జరుగుతోంది.

ఇక్క‌డ ఏక‌గ్రీవం..
అధికార‌పార్టీ కొన్ని స్థానాల‌ను ఇప్ప‌టికే ఏక‌గ్రీవం చేసుకుంది. అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన అయిదు స్థానాల‌ను ఆ పార్టీకి చెందిన అభ్య‌ర్థులకు ఎదురుగా ఎవ‌రూ నిల్చోక‌పోవ‌డంతో వారు ఏక‌గ్రీవం అయిన‌ట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఎన్నిక‌ల స‌ర‌ళిపై మండిప‌డ్డ చంద్ర‌బాబు
ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మినిట్ టు మినిట్ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మానిటర్ చేస్తున్నారు. పోలింగ్లో అక్రమాలు, వైసీపీ దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను అధినేతకు వివరించిన పార్టీ నేతలు వివిధ ఘటనలపై కడప ఎస్పీ, తిరుపతి జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో ఆయ‌న ఫోన్లో మాట్లాడారు. ఇవాళ ఉదయం నుంచి జరిగిన ఘటనలు అధికారులకు వివరించి తక్షణ చర్యలు తీసుకోవాల‌ని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికలు ఇంత స్థాయిలో అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలు దిగకపోవడం దారుణమ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో ఇతర రాష్ట్రాలనుంచి ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉందని ఆరోపించారు. పట్టభద్రులు ఓటువేయాల్సిన ఎన్నికల్లో అనర్హులతో, నిరక్షరాస్యులతో బోగస్ ఓట్లు వేయిస్తున్నార‌న్నారు.