డబ్బులు తీసుకున్నా జనసేనకే ఓటెయ్యండి: పవన్
“డబ్బులు తీసుకోకుండా ఓటెయ్యండి.. డబ్బులు తీసుకోకుండా వుండలేకపోతే డబ్బులు తీసుకుని జనసేనకు ఓటెయ్యండి….మొత్తానికి ఏదేమైనా వైకాపాకు మాత్రం ఓటేయ్యకండి” అన్నారు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈరోజు మంగళగిరిలో జరిగిన కాపు సంక్షేమ సేన సదస్సులో పవన్ మాట్లాడారు. కాపు నాయకులు సమాజానికి పెద్దన్న పాత్ర వహించాలని కోరారు. తెలుగుదేశంతో 20 సీట్లకు పోటీ కుదిరింది అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తాను లోపాయికారీ ఒప్పందాలు చేసుకోనని స్పష్టం చేసారు. అలా మన గౌరవం తగ్గించే పొత్తులకు వెళ్ళనని, ఏ ఒక్క జనసైనికుడి ఆత్మగౌరవం తగ్గించే పని నేను చెయ్యనని తెలిపారు.
నాకు తెలీకుండానే పార్టీ పెట్టి పదేళ్లు గడిచిపోయాయి. ప్రతి కాపు నాకు ఓటేసి ఉంటే నేను గెలిచేవాడ్ని. కానీ వేయలేదు. ఎందుకంటే.. అన్నా నీ సినిమాలకు మేం అభిమానులం కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మా కులంలోని వ్యక్తికే వేసుకుంటాం అని ఒకరు నాతో చెప్పారు. అది విని నేను బాధపడలేదు, కోప్పడలేదు. వారి నిర్ణయాన్ని గౌరవించాను. అందుకే నేను ఇంకా ధృడంగా నిలబడగలిగాను. అధికారం చూసిన వర్గాలనూ కలుపుకుంటూ అధికారం చూడని వర్గాలకీ రాజ్యాధికారం అందించే విధంగా జనసేన ప్రయాణం ఉంటుంది. నేను ఓడిపోతే తొడలు కొట్టింది కాపులే సరిగా సినిమాలు చేస్తే రోజుకు రూ.2కోట్లు సంపాదించే సత్తా నాకు ఉంది. కాపులు కూడా కొన్ని సంఘాలుగా విడిపోయారు, ఐక్యత ఉంటేనే రాజ్యాధికారం సాధ్యం. డబ్బులు తీసుకోకుండా ఓటెయ్యండి.. డబ్బులు తీసుకోకుండా వుండలేకపోతే డబ్బులు తీసుకుని జనసేనకు ఓటెయ్యండి….మొత్తానికి ఏదేమైనా వైకాపాకు మాత్రం ఓటేయ్యకండి. డబ్బు తీసుకోకుండా ఓటు వేయడానికే ప్రయత్నించండి. లేదా కొత్త 2000 నోటు చూసి తీసుకోకుండా ఉండలేకపోయాను అని అనుకుని తీసుకున్నా కూడా జనసేనకే ఓటు వేయండి అంటూ చెప్పుకొచ్చారు పవన్.