ఐటమ్ భామగా పేరొందినా.. గొప్ప మనసు చాటుకున్న నటి!
ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్. ప్రాణాలను కబళించే ఈ వ్యాధికి చిన్నాపెద్దా తేడా లేదు, పేద, ధనిక తారతమ్యం తెలియదు. అందరి ఆయువునీ హరించి వేస్తుంది. అలాంటి ప్రాణాంతక మహమ్మారి బారినే పడింది సినీనటి హంసా నందిని. కానీ ఆమె ఆ వ్యాధిని జయించింది. తిరిగి సరికొత్తగా జీవితాన్ని ప్రారంభించింది. భయం, ఒత్తిడి, ఆందోళనలను జయించి ఆత్మస్థైర్యంతో చికిత్సను ఎదుర్కొన్నది.. చివరకు విజేతగా నిలిచింది. తనలాంటి కష్టం రాకుండా కొందరినైనా కాపాడాలని నడుం బిగించింది. తన తల్లి యామిని పేరున ఓ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించి గొప్ప మనసు చాటుకుంది. ఐటెం భామగా పేరు గడించిన హంసానందిని చేసిన పనికి అభిమానులతోపాటు ప్రముఖులూ అభినందిస్తున్నారు.
పద్దెనిమిదేళ్ల కిందట హంసానందిని తల్లి యామిని బ్రెస్ట్ కేన్సర్‌తో పోరాడి ప్రాణాలు విడిచింది. కరోనా తరువాత ఏదో ఇబ్బందిగా ఉండి పరీక్ష చేయించుకొంటే హంసానందినికీ బ్రెస్ట్ కేన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. గ్రేడ్-3 కార్సినోమా. అని తేలడంతో హంసానందినిక ప్రాణం పోయినంత పనయింది. ఆ క్షణం ఆమెకు గతించిన అమ్మ కళ్ల ముందు కదిలింది. గత అనుభవం మిగిల్చిన చేదు జ్ఞాపకం, భయం, గందరగోళం, ఆందోళన… డయాగ్నసిస్ తరువాత అన్నీ ఒక్కసారిగా ఆమెలో భయాలు ఆవహించాయి. మనసులో ఏవేవో ఆలోచనలు. వరుస టెస్ట్‌లు, స్కానింగ్‌లు. అయితే సర్జరీకి ముందు తనకు తానే ధైర్యం చెప్పుకున్నది. శస్త్రచికిత్స చేసి వైద్యులు ట్యూమర్ తొలగించారు. పదహారు సైకిల్స్ కీమోథెరపీ చేశారు. దాంతో ముప్పు తప్పిందనుకొని ఊపిరి పీల్చుకున్న ఆమె ఆనందం అంతలోనే ఆవిరైపోయింది.
అనంతర వైద్య పరీక్షల్లో హంసానందినికి మరో భయంకరమైన విషయం తెలిసింది. బీఆర్‌సీఏ1 (హెరిడిటరీ బ్రెస్ట్ కేన్సర్) పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. దీనివల్ల జీవితంలో మళ్లీ బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు 70 శాతం ఉంటాయని తెలయడంతో గుండె ఆగినంతపనయింది. దీని కోసం మరికొన్ని సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. గుండె నిబ్బరంతో. వైద్యుల సూచనతో గత ఏడాది ఆ సర్జరీలు కూడా చేయించుకున్నది. వాటిని ఎదుర్కొనే సమయంలో ఆమె కొన్ని కొన్ని ప్రమాణాలు చేసుకున్నది. అందులో మొదటిది తన జీవితాన్ని నిర్ణయించే అవకాశం క్యాన్సర్‌కు ఇవ్వకూడదు. ఎంత కష్టమైనా సరే చిరునవ్వుతో పోరాడాలి. మరింత ఉత్సాహం, దృఢచిత్తంతో మళ్లీ తెరపై మెరవాలి. అందరికీ తన కథ చెప్పి తద్వారా అవగాహన కల్పించి, స్ఫూర్తి నింపాలని అనుకున్నది. క్యాన్సర్ నిర్థారణ నాటి నుంచి దాన్ని జయించడం వరకు హంసానందినిని ప్రధానంగా దోహదం చేసినవి… ఆ వ్యాధిని ముందుగానే గుర్తించడం, అద్భుతమైన వైద్య బృందం… ఆమె కుటుంబం మద్దతుగా నిలవడం, సానుకూల ఆలోచనా విధానం. ఈ కారణాలవల్లే గత ఏడాది నవంబర్‌లో నేను తిరిగి సినిమా సెట్‌లోకి అడుగు పెట్టగలిగింది. ఇన్నాళ్ల తరువాత కెమెరా ముందు నిలుచున్నప్పుడు గొప్ప అనుభూతికి లోనయింది. సెట్స్‌లోవారు, అభిమానులు ఇప్పుడు హంసానందినిని ‘వారియర్’ అని, ‘ఫైటర్’ అని పిలుస్తున్నారు. అంతేకాదు మళ్లీ హంసానందినికి పూర్వ వైభవం వచ్చింది. వరుస ప్రాజెక్టులు సంతకం చేస్తోంది.
ఇక మిగిలిన జీవితాన్ని క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేటాయిద్దామని నిర్ణయించుకున్నది హంసానందిని. రెగ్యులర్ సెల్ఫ్ చెకప్స్, మామోగ్రఫీ, జెనెటిక్ పరీక్షలు చేయించుకొంటే క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని చెబుతోంది. బ్రెస్ట్ కేన్సర్, దానికి సంబంధించిన చికిత్సల గురించిన సమాచారం దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నది తన లక్ష్యమని హంసానందిని చెబుతోంది. కీమోథెరపీ తీసుకొంటున్న సమయంలోనే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆఖరి క్షణంలా జీవించాలని… క్యాన్సర్‌పై విస్తృత అవగాహన కల్పించి, సాధ్యమైనంతమంది ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకుందట. దాని కోసమే తన తల్లి పేరు మీద ‘యామిని కేన్సర్ ఫౌండేషన్’ నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ‘కష్టాలతో కూడిన ప్రయాణం అందమైన గమ్యానికి మార్గం. ఎప్పుడూ బతుకు మీద ఆశ వదులుకోవద్దు. కేన్సర్ నుంచి బయటపడడం ఒక్కటే కాదు. మళ్లీ ఆరోగ్యకరమైన, అద్భుతమైన జీవితం కూడా సాధ్యమే. నిజానికి జీవితంలో మనకు లభించేది పది శాతమే. మిగిలిందంతా దానికి మనం ఎలా స్పందిస్తామనేదాని మీదే ఆధారపడి ఉంటుంది.’ అని క్యాన్సర్ బాధితులకు ధైర్యం చెబుతోంది హంస.