రాజకీయాలపై రజినీకాంత్​ సంచలన వ్యాఖ్యలు!

సూపర్​స్టార్​ రజినీకాంత్​కి మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రజినీ స్టైల్​, యాక్టింగ్​ అంటే దక్షిణాది అభిమానులు తెగ ఇష్టపడతారు. ఇక రజినీకాంత్​కి తమిళనాడులో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న్క‌ర్లేదు. సినిమాల ద్వారా అశేష అభిమానుల్ని సంపాదిందుకున్న ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాలని అభిమానులు గ‌ట్టిగానే కోరుకున్నారు. రజినీ కూడా రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ అనుకోని విధంగా పలు ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రావ‌టంతో రాజకీయాల్లోకి రావటం లేదని ప్రకటించి తప్పుకున్నారు. అయితే ఇప్ప‌టికీ ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తారేమోన‌ని, చెయ్యాలనీ ఆస‌క్తిగా, ఆశ‌గా ఎదురు చూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. పొలిటిక‌ల్‌గా ఆయ‌న ఏ పార్టీకి మ‌ద్ద‌తుగా ఉంటార‌నే దానిపై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా రజినీకాంత్​ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు వైరల్​ అవుతున్నాయి.

శ‌నివారం చెన్నైలో సేఫియ‌న్స్ హెల్త్ ఫౌండేష‌న్ ర‌జ‌తోత్స‌వ కార్య‌క్ర‌మాల్లో సూపర్​స్టార్​ రజినీకాంత్​ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంక‌య్య‌నాయుడుని ఉద్దేశించి ర‌జినీకాంత్ మాట్లాడుతూ ‘గొప్ప నాయ‌కుడైన వెంక‌య్య నాయుడుగారిని రాజ‌కీయాల నుంచి దూరం చేశారు. ఆయ‌న‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి ఇవ్వ‌టం నాకు న‌చ్చ‌లేదు’అన్నారు. దాంతో రాజకీయాల నుంచి వెంకయ్యనాయుడిని దూరం చేయడానికి మాత్రమే ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి తప్పించేశారనీ, రాష్ట్రపతి పదవి ఇవ్వకుండా అవమానించారనీ, దక్షిణాది నాయకులను కావాలనే తొక్కేస్తున్నారంటూ సోషల్​మీడియా వేదికగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రజినీకాంత్‌పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ‘ఆరోగ్యంగా ఉండాల‌ని రాజ‌కీయాల్లోకి రావొద్ద‌ని ర‌జినీకాంత్‌కు నేను స‌ల‌హా ఇచ్చాను. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలంటే రాజ‌కీయాలు మాత్ర‌మే మార్గం కాదు. చాలా దారులున్నాయి. అలాగని నేను రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారిని వ్య‌తిరేకించ‌టం లేదు. నిరుత్సాహానికి గురి చేయ‌టం లేదు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత భావం ఉంటేనే రాజ‌కీయాల్లోకి రావాలి’ అన్నారు. దీంతో సోషల్​ మీడియాలో రజినీ రాజకీయ ప్రవేశం గురించి చర్చ మొదలైంది. నిజానికి కొన్నేళ్ల ముందే రజినీ కాంత్​ రాజకీయ రంగ ప్రవేశం ఖరారైందని వార్తలు వచ్చాయి. అందరూ అనుకున్నట్టే రజినీ కూడా త్వరలోనే పార్టీ పేరు అనౌన్స్​ చేసి, పార్టీ గుర్తును ప్రకటిస్తామని తెలిపారు. కానీ అనుకోకుండా ఓ సినిమా షూటింగ్​లో అస్వస్థతకు గురైన రజినీ హైదరాబాద్​లోని ఓ హాస్పటల్లో చికిత్స తీసుకున్నారు. అప్పుడే రాజకీయాల్లోకి రావాలనుకోవట్లేదని ప్రకటించి అభిమానులను నిరాశ పరిచారు.
ప్రస్తుతం రజినీకాంత్​ ‘జైలర్​’, ‘లాల్​ సలాం’ సినిమాల షూటింగ్​తో బిజీగా ఉన్నారు. రెండేళ్లుగా రజినీ సినిమాకోసం వేచి చూస్తున్న అభిమానులకు జైలర్​తో మంచి ట్రీట్​ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. చివరగా రజినీ పెద్దన్న సినిమాలో అన్నగా అందరి మనసునూ దోచుకున్న సంగతి తెలిసిందే.