Liquor Scam: కవితకు మళ్లీ ఈడీ సమన్లు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాంలో ఈడీ నిన్న దాదాపు తొమ్మిది గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే. దిల్లీలో జరిగిన ఈ విచారణ అనంతరం అర్థరాత్రి తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడారు. ఆ తర్వాత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే.. కవితకు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 16న మళ్లీ విచారణకు హాజరుకావాలని కోరింది.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, అమిత్ అరోరా, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరాలు కవిత పాత్రపై వాంగ్మూలాల్లో స్పష్టంగా వివరించారు. ఇక అరుణ్ పిళ్లై కవిత పేరును పదే పదే ఈడీ ముందు ప్రస్తావించారని సమాచారం. దీంతోపాటు ఆమె కోసమే ఈ మద్యం కుంభకోణంలో తాను పాలుపంచుకున్నట్లు పిళ్లై తెలియజేశారట. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో మద్యం విధానం రూపకల్పనకు సంబంధించి జరిగిన సమావేశంలో కవిత పాల్గొన్నట్లు ఈడీ పలు సందర్భాల్లో కోర్టుకు తెలిపింది. అయితే.. అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినల్లి, మాగుంట రాఘవరెడ్డితో పాటు ఇతరులతో ఉన్న వ్యాపార సంబంధాలు.. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా మార్గం ద్వారా చెల్లించిన ముడుపులు.. ఇండోస్పిరిట్స్ కంపెనీలో అరుణ్ పిళ్లై పేరిట ఉన్న 32.5 శాతం వాటాలు.. వంటి అంశాలపై ఈడీ అధికారులు కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ముఖ్యంగా.. కవిత గురించి బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కన్నెర్రజేస్తున్నారు. బండి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. మరోవైపు.. సంజయ్‌పై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు. కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే ఈడీ అరెస్ట్ చేయక ముద్దుపెట్టుకుందా అని బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసారు. దాంతో బీఆర్ఎస్ నేతలు ఆయనపై, మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.