Railway Clerk: చిల్ల‌ర ఇవ్వ‌లేదని.. 26 ఏళ్లుగా స‌స్పెన్ష‌న్‌లో

మ‌నం బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు కండ‌క్ట‌ర్ చిల్ల‌ర లేదు తర్వాత ఇస్తా అన‌డం.. మ‌నం మ‌ర్చిపోయి దిగిపోవ‌డం వంటివి సాధార‌ణ జ‌రిగే ఘ‌ట‌న‌లే. కొంద‌రైతే ఇస్తావా చ‌స్తావా అని కూర్చుంటారు. ఇంకొంద‌రు పోతే పోనీలే చిల్లరే క‌దా అని వ‌దిలేస్తారు. ఇలా రైల్వే స్టేష‌న్ల‌లోనూ జ‌రుగుతుంటాయి. ఓ వ్య‌క్తి టికెట్ కొనుక్కున్నాక‌.. రైల్వే క్ల‌ర్క్ (railway clerk) ఇచ్చిన చిల్ల‌ర‌లో ఇంకా రూ.6 బాకీ ఉంది. చిల్లర లేదు త‌ర్వాత ఇస్తాన‌ని చెప్పాడు. ఈ 6 రూపాయ‌లు అత‌ని జీవితాన్ని త‌ల‌కిందులు చేసేసింది.

అస‌లు క‌థేంటంటే.. అది ముంబై. 1997 ఆగ‌స్ట్ 30. రైల్వే క్లెర్క్‌ల ప‌నితీరును ప‌రిశీలించేందుకు ఒక్కోసారి రైల్వే పోలీసులే ప్ర‌యాణికుల్లాగా వ‌చ్చి చెకింగ్ చేస్తుంటారు. అలా ఆగ‌స్ట్ 30న రాజేశ్ వ‌ర్మ అనే వ్య‌క్తి కుర్లా టెర్మిన‌స్ జంక్ష‌న్ వ‌ద్ద రైల్వే క్ల‌ర్క్‌గా ప‌నిచేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో సాధార‌ణ చెకింగ్ చేయ‌డానికి ఓ రైల్వే పోలీస్ ప్యాసెంజ‌ర్‌లా వచ్చి కుర్లా నుంచి ఆరా స్టేష‌న్‌కు టికెట్ కొనుగోలు చేసాడు. ఆ రైల్వే పోలీస్ రూ.500 ఇచ్చాడు. అప్ప‌ట్లో టికెట్ ధ‌ర 214. దాంతో రాజేశ్ అత‌నికి రూ.6 త‌క్కువ 280 ఇచ్చాడు. మిగ‌తా 6 రూపాయ‌లు ఎక్క‌డ అని అడిగితే చిల్ల‌ర లేదు. ఈసారి ఎప్పుడైనా వ‌చ్చిన‌ప్పుడు ఇచ్చేస్తాను అన్నాడు. (railway clerk)

దాంతో అనుమానం వ‌చ్చి అదే రోజున వ‌ర్మ అమ్మిన టికెట్ల క్యాష్‌ను పరిశీలించ‌గా రూ.58 రూపాయ‌లు మిస్ అయిన‌ట్లు తెలిసింది. పైగా అత‌ని క‌బోర్డ్‌ను త‌నిఖీ చేయ‌గా రూ.450 దొరికింది. అదంతా చిల్ల‌ర ఎగ్గొట్ట‌డంలో, టికెట్ల కొనుగోలు నుంచి వ‌చ్చిన డ‌బ్బు నుంచి నొక్కేయడంలో జ‌మ చేసిన డ‌బ్బు. దాంతో వెంట‌నే ఆ పోలీస్ రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత‌న్ని వెంట‌నే రైల్వే క్ల‌ర్క్ బాధ్య‌త‌ల నుంచి స‌స్పెండ్ చేసారు.

అంత‌టితో ఆగలేదు. రైల్వే శాఖ రాజేష్‌పై డిసిప్లైన‌రీ క‌మిటీ వేసింది. అలా 2002లో అత‌ను దోషి అని తేలింది. దాంతో అత‌ని ఉద్యోగం పోయింది. మ‌ళ్లీ ఉద్యోగంలో చేర‌డం కోసం రాజేష్ చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. ఎన్ని అర్జీలు పెట్టుకున్నా రాజేష్ చేసింది నేర‌మే అంటూ అత‌ని అర్జీలు రిజెక్ట్ చేసేవారు. ఇటీవ‌ల మ‌రోసారి కోర్టులో అర్జీ పెట్టుకోగా రాజేష్ త‌రఫు లాయ‌ర్ వాదిస్తూ.. రాజేష్‌కి కేటాయించిన లాక‌ర్ కేవ‌లం అత‌నిది మాత్ర‌మే కాద‌ని చాలా మంది ఆ లాక‌ర్‌ను వాడుతూ ఉండేవార‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ రాజేష్ చేసింది త‌ప్పు కాదు అని న‌మ్మ‌డానికి స‌రైన ఆధారాలు ల‌భించ‌లేదు. దాంతో ఈసారి కూడా రాజేష్ పెట్టుకున్న పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. అలా కేవ‌లం రూ.6 కోసం క‌క్కుర్తి ప‌డిన రాజేష్ జీవితాంతం బాధ‌ప‌డే శిక్ష ప‌డింది. (railway clerk)