ఈడీ విచారణకు కవిత.. ఢిల్లీలోనే కేటీఆర్‌, హరీష్‌ మకాం!

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను నేడు ఈడీ విచారించనుంది. బీఆర్‌ఎస్‌ శ్రేణులు, పార్టీ ముఖ్య నాయకుల నడుమ ఇవాళ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు. దీంతో అటు తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోనూ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే కవిత వెంట ఆమె సోదరుడు తెలంగాణ మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు ఢిల్లీలోనే మకాం వేశారు. విచారణకు ముందు కవితతో.. కేటీఆర్, హరీష్ భేటీ అయినట్లు సమాచారం. మరోవైపు అనేక మలుపులు తిరుగుతున్న మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టు కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో కూడా సీఎం కేసీఆర్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కవిత అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని… బీజేపీ అదే ప్లాన్‌లో ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆమె అరెస్టు అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, బీజేపీ చేసే పనులను ఏవిధంగా ఎండగట్టాలి అనే అంశాలపై నేడు నాయకులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

రిమాండ్‌ రిపోర్టు ఆధారంగా కవితపై విచారణ..
ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆమె మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు, అమిత్‌ అరోరా, అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, అప్రూవర్‌గా మారిన దినేశ్‌ అరోరాలు కవిత పాత్రపై వాంగ్మూలాల్లో స్పష్టంగా వివరించారు. ఇక అరుణ్‌ పిళ్లై కవిత పేరును పదే పదే ఈడీ ముందు ప్రస్తావించారని సమాచారం. దీంతోపాటు ఆమె కోసమే ఈ మద్యం కుంభకోణంలో తాను పాలుపంచుకున్నట్లు పిళ్లై తెలియజేశారట. దీంతో పలు అంశాలపై కవితను ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో మద్యం విధానం రూపకల్పనకు సంబంధించి జరిగిన సమావేశంలో కవిత పాల్గొన్నట్లు ఈడీ పలు సందర్భాల్లో కోర్టుకు తెలిపింది. అయితే.. అరుణ్‌ పిళ్లై, సమీర్‌ మహేంద్రు, అభిషేక్‌ బోయినల్లి, మాగుంట రాఘవరెడ్డితో పాటు ఇతరులతో ఉన్న వ్యాపార సంబంధాలు.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి హవాలా మార్గం ద్వారా చెల్లించిన ముడుపులు.. ఇండోస్పిరిట్స్‌ కంపెనీలో అరుణ్‌ పిళ్లై పేరిట ఉన్న 32.5 శాతం వాటాలు.. వంటి అంశాలపై ఈడీ అధికారులు కవితను ప్రశ్నించనున్నారు.

కేసీఆర్ కుటుంబాన్ని వేదించడంలో మోదీ బిజీ – కవితకు అసదుద్దీన్ మద్దతు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో ఈడీ విచారణను ఎదుర్కోంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతుగా నిలిచారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ”బీజేపీ ఎంపీలు ముస్లింలను ఆర్థికంగా బైకార్ట్ చేయాలని పిలుపునిచ్చారు. కానీ మోదీ ప్రభుత్వం అంతర్గత అభివృద్ధి కొరకు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల్ని వేధించడంలో బిజీగా ఉందని” అసదుద్దీన్ సెటైరికల్ ట్వీట్ చేశారు.