యువకుడి కడుపులో వోడ్కా బాటిల్.. ఫ్రెండ్స్‌ ఎంతకి తెగించారో!

నేపాలోని కొందరు ఆకతాయిలు.. తాగుబోతు మిత్రులు చేసిన చేస్టలు ఓ యువకుడి ప్రాణాలు పోయేంత పని చేసింది. ఫుల్‌గా మద్యంతాగి నిండా మత్తులో మునిగిన ఆకతాయిలు.. ఓ యువకుడి కడుపులోకి వోడ్కా బాటిల్‌ను తోసేశారు. వారి చేసిన ఆ పనికి యువకుడు చావుదాకా వెళ్లగా.. చివరికి వైద్యులు ఎంతో శ్రమించి బతికించాల్సి వచ్చింది. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. వాడ్కా బాటిల్‌ కడుపులోకి ఏ విధంగా వెళ్లింది అన్న అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నేపాల్ లోని రౌతహత్‌ జిల్లా గుజరా మున్సిపాలిటీకి చెందిన నర్సద్‌ మన్సూరీ(26)కి తీవ్ర కడుపునొప్పి రావడంతో అయిదు రోజుల ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతనికి ఎండోస్కోపీ, ఇతర స్కానింగ్‌ పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. పొట్టలోని పేగుల్లో గాజు వస్తువు ఉందని గుర్తించారు. అప్పటికే మన్సూరీ తీవ్రమైన నీరసంతో కొట్టుమిట్టాడుతుండటంతో వెంటనే ఆపరేషన్‌ చేయాలని వైద్యులు నిర్ణయానికి వచ్చారు. సుమారు రెండున్నర గంటల పాటు వైద్యుల బృందం ఆపరేషన్‌ చేసి ఎట్టకేలకు ఆ యువకుడి ప్రాణాలను రక్షించారు. పొట్టలో వోడ్కా బాటిల్‌ ఉన్నట్లు గుర్తించి దాన్ని బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. మద్యం సీసా వల్ల పేషెంట్ పేగు పగిలిందని, దీంతో పరిస్థితి విషమించిందని శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు పేర్కొన్నారు. పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు తెలిపారు. రోగికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పడంతో మన్సూరి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

మద్యం మత్తులోనే ఘటన జరిగింది..
నర్సద్‌ మన్సూరీ ఇటీవల అతని స్నేహితుడు షేక్‌ సమీమ్‌, ఇతర మిత్రులు కలిసి ఫుల్‌గా మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆకతాయి చేస్టలతోనే లేదా ఉద్దేశపూర్వకంగానో మన్సూరీ పురీషనాళం నుంచి వోడ్కా బాటిల్‌ను కడుపులోకి పంపినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. దీనివల్లే మన్సూరీ వాంతులు చేసుకోవడం, తీవ్రమైన కడుపునొప్పితో ప్రాణాపాయ స్థితికి చేరినట్లు భావిస్తున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే షేక్‌ సమీమ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన స్నేహితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు. త్వరలో వారికి సైతం పట్టుకుంటామని చెప్పారు.