Oscar: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 48 గంటల్లో ఆస్కార్ బరిలో గెలిచేదెవరో తేలిపోనుంది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఈసారి మరింత ప్రత్యేకం కానుంది. దేశం మొత్తం ఎన్నడూ లేనంతగా ఈసారి జరిగే ఆస్కార్ అవార్డుల కోసం ఎదురుచూస్తోంది. దీనికి కారణం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే అమెరికాలో ఆస్కార్ సందడి ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరగనున్న ఆస్కార్ అవార్డుల వేడుకకై ఇప్పుడు ఓటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ నటుడు సూర్య సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ విధంగా సూర్య ఓటు హక్కును ఉపయోగించుకున్నట్లు స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.
ఆస్కార్ అవార్డులను ఎంపిక చేయడం కోసం పలువురు సెలబ్రిటీలకు ఆస్కార్ ఓటును కూడా కల్పించిన విషయం మనకు తెలిసిందే. వివిధ దేశాల్లో ఓటు హక్కు కలిగిన నటీనటులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.ఇలా ఓటు హక్కు కలిగినటువంటి సెలబ్రెటీలు ఆన్లైన్ ద్వారా ఈనెల రెండవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఓటు హక్కు వినియోగించుకొని అవకాశాన్ని కల్పించారు. ఈ క్రమంలోనే సూర్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సూర్య తప్పకుండా మన తెలుగు సినిమాకి తన ఓటు వేసి ఉంటారని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.
ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కానీ ప్రతి ఏడాది జరిగే ఆస్కార్ వేడుకలలో భారతీయ చిత్రాలు పోటీ పడకపోవడంతో పెద్దగా వీటిని ఎవరు పట్టించుకునే వారు కాదు. ఇక ఈ ఏడాది లాస్ ఏంజెల్స్ లో జరగబోయే 95వ ఆస్కార వేడుకలలో భాగంగా మన తెలుగు సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో ప్రతి ఒక్కరి చూపు వేడుకలపై పడింది. ఈ ఆస్కార్ వేడుకలను చూడటం కోసం పలుచోట్ల బిగ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్స్‌లో అత్యంత వైభవంగా ఆస్కార్ వేడుక జరగనుంది.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్ తమ నటనతో తెలుగువారినే కాదు దేశవిదేశాల అభిమానులనూ మెప్పించారు. విజువల్ వండర్‌గా బాక్స్ఆఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే భారతదేశం తరపున అఫీషియల్‌గా ఆర్ఆర్ఆర్ని ఆస్కార్‌కు పంపకపోవడంతో రాజమౌళి స్వయంగా బరిలోకి దిగారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై పలు అవార్డులతో మెప్పించింది ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకుంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలపాటు వేచి చూడక తప్పదు!