Narendra Modi: మ‌ణిపూర్ ఘోరం.. శిక్ష ప‌డి తీరుతుంది

Delhi: ఎట్ట‌కేలకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) పార్ల‌మెంట్‌లో మ‌ణిపూర్ (manipur) ఘ‌ట‌న గురించి స్పందించారు. కుకి జాతికి చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న‌పై మోదీ స్పందించారు. నిందితుల‌ను క‌ఠిన శిక్ష ప‌డేలా రాష్ట్రం, కేంద్రం క‌లిసే చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని అన్నారు. వారిని వ‌దిలిపెట్టేది లేద‌ని స్ప‌ష్టం చేసారు. అవిశ్వాస తీర్మానం (no confidence motion) గురించి స్పందిస్తూ.. అపోజిష‌న్‌కి మ‌ణిపూర్ గురించి మాట్లాడాల‌న్న ఆస‌క్తి ఉంటే ఎప్పుడో మాట్లాడేవాళ్ల‌మ‌ని కానీ వారికి ఇత‌ర విష‌యాల‌పైనే ఫోక‌స్ ఉంద‌ని అన్నారు. హోం మంత్రి మ‌ణిపూర్ ఘ‌ట‌న గురించి మాట్లాడేందుకు బుధ‌వారం పిలుపునిచ్చారు. కానీ అపోషిజ‌న్‌కు కేవ‌లం రాజ‌కీయాలు మాత్ర‌మే కావాలి అని మండిప‌డ్డారు.

“” రానున్న రోజుల్లో మ‌ణిపూర్‌లో శాంతి నెల‌కొంటుంది. మ‌ణిపూర్ మహిళ‌ల‌కు, బిడ్డ‌ల‌కు ఒక్క‌టే చెప్పాల‌నుకుంటున్నాను. దేశం మీకు తోడుగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు మా జిగ‌ర్ కా తుక్డా అదేదో ఇటీవ‌ల రాష్ట్రంలో స‌మ‌స్య‌లు మొద‌లైన‌ట్లు మాట్లాడుతున్నారు. అది నిజం కాదు. మ‌ణిపూర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అన్ని స‌మ‌స్య‌ల‌కు కాంగ్రెస్ పార్టీనే కార‌ణం. మ‌ణిపూర్ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని చంపేసారు. ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు ఒక మార్గం క‌నిపెట్ట‌డానికి అక్క‌డి ప్ర‌భుత్వం ఆరేళ్ల నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కాంగ్రెస్ హ‌యాంలో మ‌ణిపూర్‌లో బంద్‌లు, ధ‌ర్నాలు త‌ప్ప ఏమీ లేవు “” అంటూ మోదీ తీవ్రంగా మండిప‌డ్డారు. దీంతో పాటు అస్సాం రాష్ట్రాన్ని కూడా BJP రానున్న రోజుల్లో మ‌రింత అభివృద్ధి చేస్తుంద‌ని మోదీ (narendra modi) ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు.

మే నెల‌లోనే మ‌రో ఘ‌ట‌న‌

మ‌ణిపూర్‌లో (manipur) మ‌రో గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మే నెల‌లో గ్యాంగ్ రేప్‌కు గురైన ఓ బాధితురాలు రిలీఫ్ క్యాంప్‌లో చికిత్స పొంది కోలుకున్న త‌ర్వాత పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. చూరాచంద్‌పూర్ జిల్లాకు (churachandpur) చెందిన 37 ఏళ్ల మ‌హిళ త‌న ఇల్లు మంట‌ల్లో కాలిపోతుంటే.. పిల్ల‌ల్ని, మ‌రో ఇద్ద‌రు బంధువుల‌తో క‌లిసి పారిపోయేందుకు య‌త్నించింది. ఆ క్ర‌మంలో కొంద‌రు వ్య‌క్తులు ఆమెను అడ్డుకుని అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ట‌. ఆ త‌ర్వాత త‌న‌ను రిలీఫ్ క్యాంప్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిపింది. చాలా మంది మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల గురించి పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తుంటే త‌న‌కూ ధైర్యం వ‌చ్చి ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నాన‌ని తెలిపింది. (manipur violence)

మ‌హిళ వెల్ల‌డించిన వివ‌రాలు

మే 3న సాయంత్రం 6:30 ప్రాంతంలో కొందరు వ్య‌క్తులు మా ఇంటిని, మా ఇంటి చుట్టు ప‌క్క‌న ఉన్న ఇళ్ల‌ని త‌గ‌ల‌బెట్టారు. ఆ స‌మ‌యంలో ఇంట్లో నేను నా ఇద్ద‌రు పిల్ల‌లు, ఇద్ద‌రు బంధువులు ఉన్నారు. పిల్ల‌ల్ని భుజాన వేసుకుని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసాం. ప‌రిగెడుతున్న స‌మ‌యంలో రాయి అడ్డు త‌గిలి బిడ్డ‌తో స‌హా కింద ప‌డిపోయా. అప్ప‌టికే మ‌మ్మ‌ల్ని వెంబ‌డిస్తున్న వ్య‌క్తులు న‌న్ను ప‌ట్టుకున్నారు. మా వ‌దిన నా పిల్ల‌ల్ని తీసుకుని ప‌రుగులు తీసింది. కానీ నేను దొరికిపోయాను. ఎంత వేడుకున్నా వ‌ద‌ల్లేదు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చేతులు వేస్తూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడారు. అలా నాపై న‌లుగురు వ్య‌క్తులు అత్యాచారం చేసారు. ఆ త‌ర్వాత నేను ఈ రిలీఫ్ క్యాంప్‌కి చేరుకున్నాను. ఇన్నాళ్లూ ఈ విష‌యం బ‌య‌టికి తెలిస్తే నా కుటుంబ ప‌రువుపోతుంద‌ని, చుట్టు ప‌క్క‌ల వారు చిన్న‌చూపు చూస్తార‌ని చెప్ప‌లేదు, కానీ నాలాంటి ఎంద‌రో మ‌హిళ‌లు ఇప్పుడు ఫిర్యాదులు చేస్తుంటే ధైర్యం వ‌చ్చి చెప్తున్నా అని బాధితురాలు పోలీసుల‌కు వెల్ల‌డించింది.