బ్యాక్ టు బ్యాక్ సంత‌కాలు చేసేస్తున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం

ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకన్న హీరో కిరణ్​ అబ్బవరం. వరుస సినిమాలతో దూసుకుపోతున్న కిరణ్​ ఇటీవల విడుదలైన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో మంచి హిట్​ అందుకున్నారు. మరో సినిమా ‘మీటర్’ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించారు. ఈ సినిమాకి సంబంధించిన పూజాకార్యక్రమాల ఫోటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. కిర‌ణ్ అబ్బవ‌రం హీరోగా శివం సెల్యులాయిడ్స్ ప‌తాకంపై ప్రొడ‌క్షన్ నెంబ‌ర్-2గా సరికొత్త ల‌వ్ యాక్షన్ డ్రామా రూపొంద‌నుంది. ఈ చిత్రం ద్వారా విశ్వక‌రుణ్ ద‌ర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం రామానాయుడు స్టూడియోస్‌లో ఘ‌నంగా జ‌రిగింది. హీరోపై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి ప్రముఖ ద‌ర్శకుడు వి.వి.వినాయ‌క్ క్లాప్ ఇవ్వగా.. ప్రముఖ నిర్మాత‌లు ద‌గ్గుబాటి సురేష్ బాబు, ఎ.ఎం.ర‌త్నం కెమెరా స్విచాన్ చేశారు.
చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాత‌లు కె.ఎస్.రామారావు, జెమిని కిర‌ణ్‌, శిరీష్, వ‌ల్లభ‌నేని వంశీ, న‌ల్లమ‌ల‌పు బుజ్జి, రామ్ తాళ్లూరి, దామోద‌ర‌ప్రసాద్, కె.కె.రాధామోహ‌న్, బెక్కెం వేణుగోపాల్, ప్రస‌న్న కుమార్, తుమ్మల‌ప‌ల్లి రామ‌స‌త్యనారాయ‌ణ‌ త‌దిత‌రులు అతిథులుగా హాజ‌రై సినిమా విజ‌యం సాధించాల‌ని శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ నెలలోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇత‌ర వివ‌రాల‌ను త్వర‌లోనే వెల్లడిస్తామ‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు.
2019లో ‘రాజా వారు రాణి గారు’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన కిరణ్​ అబ్బవరం రెండో సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మంచి గుర్తింపు అందుకున్నారు. కిందటేడాది ‘సెబాస్టియన్ పీసీ 524’, ‘సమ్మతమే’, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ, ఈ ఏడాది కిరణ్ హీరోగా గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కమర్షియల్‌గా విజయం సాధించింది. ఇప్పుడు ‘మీటర్’ కూడా కమర్షియల్‌ హిట్టు కొట్టేలా కనిపిస్తోంది.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’సినిమా రూ.15 కోట్ల మేర బాక్సాఫీసు కలెక్షన్ వసూలు చేసింది. నిజానికి ఇది ఊహించిన విజయమే అయినా.. మరీ ఈ స్థాయి కలెక్షన్స్ నిర్మాతలు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదట. మొత్తం మీద కిరణ్‌కు అవకాశమిచ్చి మంచి కథతో ముందుకెళ్లిన నిర్మాతలు ఫైనల్ బిజినెస్ నంబర్స్ చూసి చాలా సంతోషంగా ఉన్నారట. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా కెరీర్‌పై దృష్టి పెట్టడం వల్లే కిరణ్‌కు ఈ విజయం సాధ్యమైందని టాలీవుడ్​ టాక్​.