ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో తెలుసా?
చాలా మంది గ్రాడ్యుయేట్లు పట్టభద్రుల ఎన్నికల్లో తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో ఎక్కువ మంది కొత్తగా ఓటు వేయనున్నారు. ఈక్రమంలో వారు ఓటును ప్రాధాన్యతా క్రమంలో ఏ విధంగా వేయాలని అన్న అంశాలపై విశాఖ జిల్లా కలెక్టర్ పలు విషయాలను వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దామా..
ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. ఇక ఈ ఎన్నిక ఈ నెల 13న జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఓటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి మల్లికార్జున సూచించారు. ఓటర్లకు ఓటు స్లిప్పుతోపాటు ఓటు వేసేటప్పుడు తీసుకోవలసిన సూచనలతో కరపత్రం పంపిణీ చేస్తున్నామన్నారు. బ్యాలెట్ పేపరుపై తాము ఇచ్చిన వైలెట్ స్కెచ్ పెన్ మాత్రమే వినియోగించాలని, ఇతరత్రా పెన్సిల్, పెన్ను, బాల్‌పాయింట్ పెన్నులను వినియోగించవద్దని.. అలా చేస్తే ఓటును రద్దు చేస్తామని ఆయన చెప్పారు. మొదటి ప్రాధాన్యంగా ఎంచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఓ కాలమ్ ఉంటుందని.. అందులో ‘1’ అని… తర్వాత ప్రాధాన్య క్రమంలో తదుపరి అభ్యర్థులకు వరుసగా 2, 3, 4, 5 అని కాలమ్‌లో నంబర్లు వేయాలని సూచించారు. ప్రాధాన్యతలను సంఖ్య రూపంలోనే సూచించాలని.. ఎలాంటి పదాలు బ్లాంక్స్లో రాయకూడదని తెలిపారు. బ్యాలెట్ పేపర్‌పై పేర్లు రాయడం గానీ, వేలిముద్రలు రాయడం చేస్తే… ఓట్లు చెల్లవన్నారు. ఎలాంటి టిక్ మార్కు, క్రాస్ మార్కుపెట్టవద్దని అటువంటి బ్యాలెట్ పేపర్లను పరిగణించరని ఆయన పేర్కొన్నారు.
కౌంటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు…
ఉత్తరాంధ్ర మూడు జిల్లాలోని ఓటర్లు అందరూ కలిపి మొత్తం 2,87,258 మంది ఉన్నారని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే 37 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్ పత్రాలు బుధవారం నగరానికి చేరగా… విశాఖ జిల్లావి మినహాయించి మిగిలినవి ఏ జిల్లాకు ఆ జిల్లాకు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖ జిల్లాకు చెందిన పత్రాలను బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు వెరిఫై చేసిన తరువాత బాక్సుల్లో పెట్టి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచినట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగినందున అందుకు అనుగుణంగా కౌంటింగ్‌కు 28 టేబుళ్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం షిఫ్ట్‌ల వారీగా సిబ్బందిని నియమించామన్నారు. మరోవైపు పోలీసు బందోబస్తు కూడా పటిష్టంగా అమలు చేస్తున్నట్లు విశాఖ సీపీ తెలిపారు. ఎన్నికలకు మరో నాలుగు రోజుల సమయమే ఉండటంతో.. జిల్లాలో మొత్తం 112 పోలింగ్ కేంద్రాల్లో జరుగు ఎన్నికలకు 358 బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ 84 -శాతం పూర్తి అయినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 840 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
రెండు రోజులు సెలవులు..
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు జరిగే ప్రభుత్వ బడులు, ప్రైవేటు కాలేజీలకు సాధారణ సెలవులను ప్రకటించారు. 12, 13 తేదీల్లో తరగతులు నిర్వహించవద్దని అందరికీ సెలవులు ప్రకటించాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.