సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి.. నేటితో వివేకా కేసు క్లోజ్ అవుతుందా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సీబీఐ అధికారులు కేసు టేకప్ చేసిన దగ్గరి నుంచి విచారణ వేగం పుంజుకుంది. ఇప్పటికే పలుమార్లు నిందితులను విచారించిన అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. అయితే.. వివేకా హత్య వెనుక బడా నేతల హస్తం ఉందంటూ వస్తున్న వార్తలపై కూడా సీబీఐ దృష్టి సారించింది. ఈక్రమంలో వరుసగా మూడో సారి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మరోసారి విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కానున్నారు. ఈనేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి గురువారం పలు అనుమానాలు లేవనెత్తారు. తనను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని.. అలా జరగకుండా ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. వివేకా కేసు కీలక దశలో ఉన్న తరుణంలో అవినాష్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అరెస్టు భయం వెంటాడుతోందా..
సీబీఐ విచారణకు ఇప్పటికే రెండు సార్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించారు. ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని ఆయన్ని ఆదేశించిన క్రమంలో ఈ సారి తనను అరెస్టు చేస్తారేమోనని అవినాష్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అంతేకాకుండా కోర్టుకు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో సీబీఐపై అనేక ఆరోపణలు చేశారు. వివేకా కుటుంబంలో చాలా వివాదాలున్నాయని.. సొంత కుటుంబం నుంచే వివేకాకు ముప్పు ఉండిందని తెలిపారు. దీంతోపాటు.. తన వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు చేయాలని వ్యక్తిగతంగా సీబీఐ అధికారులకు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదని.. జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండు దఫాలు సీబీఐ తనను విచారించింది. అన్ని వివరాలూ వెల్లడించినప్పటికీ.. ఇంకా ఇబ్బంది పెడుతోందని ఆయన కోర్టుకు విన్నవించారు. తన స్టేట్మెంట్ను ఆడియో వీడియో రికార్డు చేయడంతోపాటు స్టేట్మెంట్ కాపీని ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని.. విచారణకు తనతోపాటు ఓ న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును అవినాష్ కోరారు. అరెస్టుతో సహా సీబీఐ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు జారీచేయాలని కోరారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి తన పట్ల దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని.. ప్రజల్లో తనకు చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వివేకాకు కుటుంబ తగాదాలు ఉన్నాయి..
మృతుడు వివేకానందరెడ్డికి షేక్ షమీమ్ అనే మహిళను రెండో వివాహ చేసుకున్నారని.. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడని అవినాశ్‌రెడ్డి సీబీఐ అధికారులకు తెలిపారు. అప్పటి నుంచి ఆయనకు, తొలి భార్య అయిన సునీత, అల్లుడికి పొసగడం లేదని.. వారి మధ్య 2011 నుంచి సత్సంబంధాలు లేవన్నారు. షమీమ్‌కు పుట్టిన కుమారుడికి రూ. 2 కోట్లు డిపాజిట్ చేస్తానని వివేకా హామీ ఇచ్చారని.. అప్పటి నుంచి ఆయన్ను సునీత, ఆమె భర్త దూరంగా ఉంచారన్నారు. వివేకా భార్య, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారని పేర్కొన్నారు. వారసత్వం షమీమ్ కుమారుడికి వెళ్లిపోతుందోనని వివేకాను పూర్తిగా దూరంపెట్టి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. వివేకా కుమార్తె సునీతా, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇద్దరికీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ బీటెక్ రవితో సత్సంబంధాలు ఉన్నాయని.. వారితో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాతే సునీత తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. హత్య జరిగిన ఏడాది వరకు ఆమె తన పేరును ఎక్కడా చెప్పలేదని సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి తెలిపారు. ఇది ఇలా ఉండగా.. శుక్రవారం సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి వెళ్తున్నారు.. మరోవైపు ఆయన తండ్రి భాస్కరరెడ్డిని ఈ నెల 12న కడప జైళ్లో విచారించనున్నారు.