టిప్ ఎక్కువ ఇవ్వలేదని ఫుడ్ తీసుకెళ్లిపోయిన డెలివరీ గర్ల్!
రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేసాక బిల్లు కట్టేటప్పుడు వెయిటర్‌కి ఎంతో కొంత టిప్ ఇస్తాం. ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ హవా ఎక్కువ అయిపోవడంతో డెలివరీ బాయ్స్‌కి టిప్ ఇవ్వాల్సి వస్తోంది. వెయిటర్లకు, డెలివరీ బాయ్స్‌కి టిప్ ఇవ్వడం ఇవ్వకపోవడం మన ఇష్టం. వారు కూడా ఒక్కోసారి పట్టించుకోకుండా పోనీలే అని వదిలేస్తారు. కానీ అమెరికాలో అలా కాదు. అక్కడి వెయిటర్లకు, డెలివరీ డ్రైవర్లకు టిప్ అంటే చాలా పెద్ద విషయం. ఇలాంటివాటిని వాళ్లు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే మీరూ షాకవుతారు.
ఇంతకీ ఏం జరిగిందంటే… అమెరికాకు చెందిన ఓ యువతి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. ఆ ఫుడ్‌ను డెలివర్ చేయడానికి ఓ మహిళా డ్రైవర్ వచ్చింది. కస్టమర్ ఫుడ్ పార్సిల్ తీసుకుని డ్రైవర్ చేతిలో 8 డాలర్లు అంటే మన కరెన్సీలో 680 రూపాయలు టిప్‌గా ఇచ్చింది. కానీ అది డ్రైవర్‌కు నచ్చలేదు. అసలు ఆ టిప్ సరిపోలేదంటూ కస్టమర్‌తో గొడవపెట్టుకుంది. దాంతో ఏం చేయాలో తెలీని కస్టమర్ ఆమెతో వాదించలేక ఫుడ్ పార్సిల్‌ను డోర్ వద్దే పెట్టి వెళ్లిపోమని చెప్పి తలుపు వేసుకుంది. దానికి డ్రైవర్ ఒప్పుకోలేదు. నేను నీతో మాట్లాడాలి బయటికి రా అంటూ కేకలు వేసింది. దానికి ఆ కస్టమర్ ఒప్పుకోకపోవడంతో తెచ్చిన ఫుడ్ పార్సిల్‌ను వెనక్కి తీసుకెళ్లిపోయింది.
డ్రైవర్‌కి అంత కోపం ఎందుకొచ్చిందంటే.. డెలివర్ చేయడానికి దాదాపు 40 నిమిషాల పాటు డ్రైవ్ చేయాల్సి వచ్చిందట. అంత దూరం నుంచి ఫుడ్ తీసుకొచ్చినప్పుడు తగినంత డబ్బు టిప్‌గా ఇవ్వమని అడగడంలో తప్పేముంది అంటూ ఆ మహిళా డ్రైవర్ తిట్టుకుంటూ వెళ్లిపోయింది. జరిగిన ఘటన మొత్తం కస్టమర్ ఇంటి ముందు ఉన్న సీసీటీవీలో రికార్డు అవడంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 8 డాలర్ల టిప్ తక్కువ ఏం కాదని, ఇలాంటి వాళ్లని ఉద్యోగంలో పెట్టుకోకూడదని కామెంట్లు పెడుతున్నారు. ఇందులో కస్టమర్ తప్పులేదంటూ సపోర్ట్ చేస్తున్నారు.