Liquor Scam: ప్ర‌తిప‌క్షాలు ఆడేసుకుంటున్నాయ్!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తప్పు చేయకపోతే కవిత, కేసీఆర్‌ కుటుంబం ఎందుకు భయపడుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు అవినీతి చేస్తే.. తెలంగాణకు అవమానకరం అని కవిత మాట్లాడటం మంత్రి ఆరోపించారు. మద్యం వ్యాపారం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించండి అని తెలంగాణ సమాజం ఏమైన కల్వకుంట్ల కుటుంబానికి చెప్పిందా..? అని ప్రశ్నించారు. ఈ కుటంబం చేసిన పనితో తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పండిందన్నారు. లిక్కర్ స్కామ్‌లో మహిళ ఉండటం ఎప్పుడూ చూడలేదన్నారు. అన్నా-చెల్లెళ్లు ఇద్దరు కూడా అబద్దాలు ఆడుతున్నారని.. కవిత కేటీఆర్‌ను ఉద్దేశించి కిషన్‌ రెడ్డి మాట్లాడారు. తప్పులు చేయకపోతే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? అన్ని సార్లు ఫోన్లు ధ్వంసం చేయాల్సిన అవసరం కవితకు ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదని కిషన్ రెడ్డి తెలిపారు. మహిళా బిల్లును బీఆర్‌ఎస్‌ మిత్రపక్షాలైన ఎంఐఎం, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు గతంలో పార్లమెంటులో అడ్డుకున్న విషయం మరిచిపోయారా అని ఆయన విమర్శించారు. మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టే.. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు రిజర్వేషన్ నాటకం మొదలు పెట్టారని.. కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

పదే పదే కవిత పేరు ఎందుకు చెబుతున్నారు – డీకే అరుణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక కక్ష సాధింపులు లేవని చెప్పారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని… అధికారంలోకి వచ్చిన వెంటనే అందరిపై కక్ష సాధింపులకు దిగిన కల్వకుంట్ల కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి అందరూ అలాగే చేస్తున్నట్టు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే అరెస్ట్ అయిన వారు పదేపదే కవిత పేరును ఎందుకు చెబుతున్నారని అరుణ ప్రశ్నించారు. ఈడీ విచారణలో కవిత ఆమె నిజాయతీని నిరూపించుకోవచ్చని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం అలవాటని విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారణకు పిలిస్తే… మొత్తం తెలంగాణ సమాజాన్నే అవమానిస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణకు కాదు.. కవితకే అవమానం – భట్టి విక్రమార్క
ఢిల్లీ లిక్కర్ స్కాంలో పాల్గొనడం కవితకు అవమానం కానీ తెలంగాణకు కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. లిక్కర్ స్కాంలో కవిత అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆమె విచారణను ఎదుర్కొనేది పోయి ఇది తెలంగాణకు అవమానం అంటున్నారు. దీనిని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా కవిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.