ఆస్కార్‌కి అంత ఖర్చు చేయాలా? రాజమౌళిపై తమ్మారెడ్డి కామెంట్స్
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళిపై.. ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ కామెంట్స్ చేసారు. రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ఆర్ఆర్ ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డులకు కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అవడం, అంతర్జాతీయ అవార్డులు రావడంపై ఒక వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్‌కు నామినేట్ అయ్యేలాచేయడానికి రాజమౌళి ఏకంగా 83 కోట్లు ఖర్చు పెట్టారట. మన దేశం తరపున గుజరాతీ మూవీ ఛెల్లో షో ఆస్కార్‌కు నామినేషన్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో 2023 ఆస్కార్ నామినేషన్స్ కోసం ఎంపికైంది.
అంతేకాకుండా ఆస్కార్ నామినేషన్స్‌కు షార్ట్ లిస్ట్ కూడా అయింది. మరోపక్క ఆర్ఆర్ఆర్ కూడా తప్పకుండా అకాడమీకి నామినేట్ అవుతుందని అంతా ఊహించారు. కానీ ఆ చిత్రాన్ని మన దేశం తరఫున ఎంపిక చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ డైరెక్టుగానే నామినేషన్స్ కోసం పోటీ పడింది. అలా డైరెక్ట్‌గా నామినేషన్స్‌కి పోటీ పడేందుకు రాజమౌళి 83 కోట్లు ఖర్చు చేసారని అందులో 90 తన సొంత డబ్బును ఖర్చు చేయగా… మిగిలిన 10 శాతం కలెక్షన్ల నుంచి వాడుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్లు చూస్తుంటే.. రాజమౌళి డబ్బు ఖర్చు పెట్టి ఆస్కార్ బరిలో నిలవాలని అనుకోవడం నిజమే అనిపిస్తోంది.
ఎందుకంటే.. ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. “సినిమా వ్యాపారంలో సామాజిక స్పృహ కోల్పోయింది. ఆస్కార్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీం 80 కోట్లు ఖర్చు చేసారు. ఆ 80 కోట్లు మాకు ఇస్తే 10 సినిమాలు తీసి వాళ్ల ముఖానకొడ్తాం” అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. దీనిని బట్టి చూస్తే ఆస్కార్ బరిలో నిలిచేందుకు రాజమౌళి డబ్బు ఖర్చే చేసారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే తమ్మారెడ్డి వ్యాఖ్యలపై ఫ్యాన్స్, ఇతర నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా డబ్బు చెల్లించి మరీ ఆస్కార్ బరిలో నిలవచ్చు అన్న రూల్ ఉన్నప్పుడు దానిని రాజమౌళి సద్వినియోగం చేసుకోవడంలో తప్పేముంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. తెలుగు సినిమాకు ఆస్కార్ తెప్పించేందుకు రాజమౌళి పడుతున్న కృషికి అభినందించాల్సింది పోయి ఇలా తప్పుబట్టడం సరైనది కాదు అని ఏకిపారేస్తున్నారు. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 95 ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 12న ఘనంగా జరగనుంది. ప్రపంచ సినీ చరిత్రలో ఆస్కార్ అవార్డుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదన్న విషయం మనకి తెలిసిందే.