Gujarat: కేసులు పెట్టిందీ ఆమే.. విడిపించిందీ ఆమే..!

Gujarat: భ‌ర్త రోజూ తాగొచ్చి కొడుతున్నాడంటూ కేసు పెట్టేదీ ఆమే..! మ‌ళ్లీ రెండు రోజులు త‌ర్వాత అత‌న్ని బెయిల్‌పై బ‌య‌టికి తీసుకొచ్చేదీ ఆమే..! ఇలా ఏదో ఒక‌టి రెండు సార్లు జ‌రిగితే ఓకే. కానీ ఆ మ‌హిళ ప‌దేళ్ల‌లో ఇలా ఏకంగా 7సార్లు కేసులు పెట్టి మ‌ళ్లీ బెయిల్‌పై బ‌య‌టికి తీసుకొచ్చింది. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లో (gujarat) చోటుచేసుకుంది. మెహ‌సానా జిల్లాకు చెందిన ప్రేమ్ చంద్, సోనూ 2001లో పెళ్లి చేసుకున్నారు. 2014 నుంచి వారి జీవితంలో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ప్రేమ్ చంద్ రోజూ త‌న‌ని కొడుతున్నాడ‌ని 2015లో మొద‌టిసారి గుజ‌రాత్ కోర్టులో గృహ‌హింస కేసు పెట్టి విడాకులకు అప్లై చేసింది.. దాంతో ప్ర‌తి నెలా సోనూకు రూ.2000 చెల్లించాల‌ని కోర్టు తీర్పునిచ్చింది. అయితే ప్రేమ్ చంద్ కూలీ ప‌నులు చేసుకునేవాడు కావ‌డంతో అంత డ‌బ్బు ఇవ్వ‌లేక‌పోయాడు. దాంతో అత‌న్ని పోలీసులు అరెస్ట్ చేసి 5 నెల‌ల పాటు జైలులో ఉంచారు.

విష‌యం సోనూకి తెలీక‌పోవ‌డంతో అత‌నికి బెయిల్ ఇప్పించేవారు లేక స్వ‌యంగా ఆమే వెళ్లి బెయిల్‌కు అప్లై చేసింది. అలా ప్రేమ్ చంద్‌ను జైలు నుంచి బ‌య‌టికి తీసుకొచ్చింది. ఇద్ద‌రూ విడి విడిగానే ఉండేవారు. అయిన‌ప్పటికీ వీరికి ఏదో ఒక విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. దాంతో 2016 నుంచి 2018 మ‌ధ్య‌లో సోనూ ప్రేమ్‌పై కేసులు పెడుతూనే ఉంది. ప్రేమ్ అరెస్ట్ అయిన ప్ర‌తీసారీ మ‌ళ్లీ ఆమే బెయిల్‌కి అప్లై చేసి విడిపించేది. 2019 నుంచి 2020 మ‌ధ్య‌లో భ‌ర‌ణం డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని పోలీసులు అరెస్ట్ చేసిన‌ప్పుడు కూడా సోనూనే బెయిల్‌పై విడిపించింది. ఇప్పుడు మ‌ళ్లీ జ‌న‌వ‌రిలో ప్రేమ్ చంద్‌ని అరెస్ట్ చేయ‌డంతో ఈ నెల‌లోనే సోనూ బెయిల్‌కి అప్లై చేసి విడిపించింది. అస‌లు వీళ్లు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారో ఆమె ఎందుకు కేసులు పెట్టి మ‌ళ్లీ ఆమే విడిపిస్తోందో అర్థంకాక పోలీసులు, జ‌డ్జిలు కూడా త‌ల‌బాదుకుంటున్నారు.