Pawan Kalyan: ఏంది BRO అంత మాట‌న్నావ్..?

Hyderabad: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) వారాహి యాత్ర సెకండ్ ట్రిప్ మొద‌లైపోయింది. ఊహించిన‌ట్లుగానే అధికార పార్టీపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ మండిప‌డ్డారు. జ‌గ‌న్ సర్కార్ (ap cm jagan) అవినీతికి పాల్ప‌డుతోందంటూ మ‌రోసారి ఆరోప‌ణ‌లు చేసారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ నిన్న స‌భ‌లో ప‌వ‌న్ చేసిన‌ వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త ఎక్కువ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఏపీలో 18 వేల మంది అమ్మాయిలు మిస్ అవడానికి కారణం వాలంటీర్లేన‌ని ప‌వ‌న్ (pawan kalyan) అన్నారు. ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి. ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు. ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా. వారిలో వితంతువులు ఉన్నారా.. ఇలాంటి వివ‌రాల‌ను వాలంటీర్లు సేకరించి.. హ్యూమన్ ట్రాఫికింగ్ (human trafficking) చేస్తున్నారని ప‌వ‌న్ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ విషయంపై కేంద్ర నిఘావర్గాలు త‌న‌ను హెచ్చరించాయని, ఇందులో YSRCP పెద్దల హస్తం కూడా ఉంద‌ని ప‌వ‌న్ తెలిపారు.

అయితే ఆయ‌న మొన్న‌టి వ‌ర‌కు చేయని ఈ కామెంట్స్ వారాహి సెకెండ్ షెడ్యూల్‌లోనే ఎందుకు చేసార‌నేది ఇక్క‌డ ప్ర‌శ్న‌. అస‌లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ప‌వ‌న్‌కి (pawan kalyan) స‌మాచారం అందించ‌డం ఏంటి? ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి, డిఫెన్స్ శాఖ‌కు త‌ప్ప మ‌రెవ్వ‌రికీ వివ‌రాలు పంపించ‌వు. మ‌రి ప‌వ‌న్‌కు వివ‌రాలు అందాయి అంటే ఇంటెలిజెన్స్ వ‌ర్గాల్లో ఆయ‌న‌కు వీరాభిమానులు ఉంటే త‌ప్ప అది సాధ్యం కాదు. పోనీ ప‌వ‌న్ చెప్పిన‌ట్లు ఏపీలో వాలంటీర్లు హ్యూమ‌న్ ట్రాఫికింగ్‌కి పాల్ప‌డుతున్నారు అన్న‌ది నిజ‌మే అయితే.. ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఇప్ప‌టివ‌ర‌కు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు? అస‌లు ఏ ఆధారాల‌తో ప‌వ‌న్ (pawan kalyan) ఇంత‌టి షాకింగ్ కామెంట్స్ చేయ‌గ‌లిగారో ఆయ‌న‌కే తెలియాలి.

2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు కాబ‌ట్టి ఇప్పుడు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనైనా జ‌న‌సేన గెల‌వాలి అని ప‌వ‌న్ (pawan kalyan) క‌ష్ట‌ప‌డుతున్నారు. అలాంటప్పుడు స‌రైన ఆధారాలు లేకుండా ఏపీ వాలంటీర్ వ్య‌వ‌స్థ గురించి ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే.. ఆ వాలంటీర్ల‌లో ప‌వ‌న్‌కు ఓటు వేయాల‌ని అనుకునేవారు కూడా వేయ‌కుండాపోతారు. ఏదో ఒక్క‌రో ఇద్ద‌రో ఇలా హ్యూమ‌న్ ట్రాఫికింగ్‌కి పాల్ప‌డుతున్నారంట అని కామెంట్ చేసినా స‌రిపోయేది. కానీ ప‌వ‌న్ మొత్తం వాలంటీర్ల వ్య‌వ‌స్థ గురించే త‌ప్పుగా మాట్లాడేసారు. దాంతో ఇప్పుడు వైసీపీకి ప‌వ‌న్ చిక్కిన‌ట్లైంది. ఇప్పుడు ఇదే పాయింట్ ప‌ట్టుకుని ఇక రోజూ స‌తాయిస్తుంటారు.

ఇప్ప‌టికీ మించిపోయింది ఏమీ లేదు. ఒక‌వేళ ప‌వ‌న్ (pawan kalyan) ద‌గ్గ‌ర రుజువు చేయ‌గ‌లిగే ఆధారాలు ఉంటే వెంట‌నే మీడియా ముందు బ‌య‌ట‌పెట్టాలి. లేదా అంద‌రూ డిమాండ్ చేస్తున్న‌ట్లు సారీ చెప్పాలి. ఇవేమీ చేయ‌కుండా ప్రచారాల్లో పాల్గొంటే జ‌నాల్లో ప‌వ‌న్‌పై న‌మ్మ‌కం త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంది. పోయిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఏదో మంచి చేస్తార‌ని ఓటు వేసిన వారు ఇప్పుడు రానున్న ఎన్నిక‌ల్లో ప‌వన్‌కు ఓటు వేసి చూద్దాం అనుకున్న‌వారి కోస‌మైనా ప‌వ‌న్ తాను చేసింది క‌రెక్టో కాదో చూసుకోవాలి. లేదంటే ప‌వ‌న్‌పై అభిమానంతో కాకుండా పవ‌న్ ఏదో మంచి చేస్తారు అని ఓటు వేయాల‌నుకునేవారికి పూర్తిగా న‌మ్మ‌కం పోతుంది.