ఆస్కార్​ కోసం రాజమౌళి అంత పని చేశారా!

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 95 ఆస్కార్​ అవార్డుల వేడుక మార్చి 12న ఘనంగా జరగనుంది. ప్రపంచ సినీ చరిత్రలో ఆస్కార్​ అవార్డుకు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ఈ సంవత్సరం నామినేషన్లలో తెలుగు సినిమా RRR కూడా చోటు దక్కించుకుంది. అయితే ఈ సినిమాకి ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ లభించకపోవడంతో సొంతంగా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా బృందం ఆస్కార్ అకాడమీ సభ్యుల కోసం అమెరికాలో స్పెషల్ షోస్​ వేసి భారీగా ఖర్చు చేసింది. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో రాజమౌళి కూడా పాల్గొని ప్రపంచం దృష్టి ఆకర్షించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు ఎన్టీఆర్, చరణ్​లతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా పాల్గొన్నారు. దీంతో ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో RRR నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. అంతేకాదు ఈ పాట ఇప్పుడు దేశ విదేశాలలో మారుమోగుతోంది. ఇటీవల ఫేమస్ BTS సింగర్ జంగ్ కుక్ ఇన్​స్టాగ్రామ్ లైవ్ లో తనకిష్టమైన సాంగ్స్​లో ఈ పాట ప్లే చేయడం తెలుగు ప్రేక్షకులకు మరింత ఊపునిచ్చింది. అయితే ఆస్కార్ బరిలో నిలవడానికి.. దర్శకుడు రాజమౌళి 83 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి.

మన దేశం తరపున గుజరాతీ మూవీ ఛెల్లో షో సినిమా ఆస్కార్‌కు నామినేషన్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో 2023 ఆస్కార్ నామినేషన్స్ కోసం ఎంపికైంది. అంతేకాకుండా ఆస్కార్ నామినేషన్స్‌కు షార్ట్ లిస్ట్ కూడా అయింది. మరోపక్క ఆర్ఆర్ఆర్ కూడా తప్పకుండా అకాడమీకి నామినేట్ అవుతుందని అంతా ఊహించారు. కానీ ఆ చిత్రాన్ని మన దేశం తరఫున ఎంపిక చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ డైరెక్టుగానే నామినేషన్స్‌ కోసం పోటీ పడింది.

ఆర్​ఆర్​ఆర్​లోని‘నాటు నాటు’ పాట ఆస్కార్ షార్ట్ లిస్టులో ఎంపికైంది. ఇటీవలే ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. ఆలియా భట్​, ఒలీవియా హీరోయిన్లుగా తొలిసారి టాలీవుడ్​ ప్రేక్షకులను పలకరించగా, అజయ్​ దేవగణ్​, శ్రియా సరన్​ కీలక పాత్రల్లో నటించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్​ వద్ద రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలై మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.