Madhyapradesh CM: ఆ గిరిజనుడి కాళ్లు కడిగిన సీఎం
Bhopal: రీసెంట్గా మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇంతటి నీచపు చర్యకు పాల్పడిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించడమే కాకుండా అతని ఇంటిని కూడా కూల్చేసారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి (madhyapradesh cm) శివరాజ్ సింగ్ చౌహాన్ (shivraj singh chouhan) బాధితుడిని తన ఇంటికి పిలిపించుకుని ఏకంగా కాళ్లు కడిగారు. మెడలో పూలమాల వేసి సన్మానం కూడా చేసారు.
అసలు ఏం జరిగిందంటే..సిద్ధి జిల్లాలోని కుబ్రి గ్రామానికి చెందిన ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి.. కొన్ని రోజుల క్రితం రోడ్డు పక్కన కూర్చుని ఉన్న దశరథ్ రావత్ అనే గిరిజనుడిపై మూత్రం పోసాడు. ఆ సమయంలో రికార్డ్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చూసిన సీఎం శివరాజ్ సింగ్ వెంటనే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. నిందితుడిని మరుసటి రోజే అదుపులోకి తీసుకుని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు బుక్ చేసి అతన్ని జైలుకు తరలించారు. ప్రవేశ్ శుక్లా ఇంటిని జేసీబీతో కూల్చేసారు. అయితే ప్రవేశ్ శుక్లా తండ్రి వాదన మరోలా ఉంది. ఆ వీడియో చాలా పాతదని ఎన్నికల సమయంలో ఓట్ల కోసం సీఎం ఆడుతున్న డ్రామా అని అంటున్నారు. ఇప్పుడు వైరల్ చేసి ప్రజల మెప్పు పొందాలని ఇలా బాధితుడిని ఇంటికి పిలిపించి కాళ్లు కడగడం వంటివి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.