Kalyana Lakshmi ప‌థ‌కంతో వ‌ర‌క‌ట్న వేధింపులు?

Hyderabad: తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన క‌ళ్యాణ ల‌క్ష్మి (kalyana lakshmi) ప‌థ‌కం వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు దారితీస్తోంద‌ట‌. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను బ‌ట్టి చూస్తే ఇది నిజ‌మేనేమో అనిపిస్తోంది. బ‌న్సీలాల్ పేట‌కు చెందిన 27 ఏళ్ల సౌంద‌ర్య అనే మ‌హిళ జూన్ 19న ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇందుకు కార‌ణం క‌ట్నం వేధింపులేన‌ని పోలీసులు తెలిపారు. సౌంద‌ర్య పుట్టింటి నుంచి క‌ట్నం తీసుకురావాల‌ని వేధించ‌డ‌మే కాకుండా.. తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన క‌ళ్యాణ ల‌క్ష్మి (kalyana lakshmi) ప‌థ‌కంలోని డ‌బ్బును కూడా త‌న బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని సౌంద‌ర్య భ‌ర్త టార్చ‌ర్ పెట్టేవాడ‌ట‌. 2014లో తెలంగాణ సీఎం KCR ఈ క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. అప్ప‌ట్లో వార్షిక ఆదాయం రూ.2 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఉన్న‌వారికి రూ.75,116 ఇచ్చేవారు. 2018లో ఆ మొత్తాన్ని రూ.1,00,116కు పెంచారు. ఈ డ‌బ్బును వ‌ధువు త‌ల్లి ఖాతాలో వేస్తామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఈ ప‌థ‌కం ద్వారా పెళ్లిళ్ల స‌మ‌యంలో పేద కుటుంబాలు ప‌డే క‌ష్టాలు, బాల్య వివాహాలు కూడా దాదాపు ఆగిపోయాయని BRS చెప్తూ వ‌చ్చింది. కానీ ఇప్పుడు ఇదే ప‌థ‌కం వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు దారి తీస్తోంది. నేష‌న‌ల్ క్రైం రికార్డుల బ్యూరో రికార్డుల ప్ర‌కారం 2021 నుంచి 2022 వ‌ర‌కు ఇండియాలో వ‌ర‌క‌ట్న వేధింపుల కేసులు 25% పెరిగాయి. ఈ కేసుల్లో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ మొద‌టి స్థానంలో ఉండ‌గా.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మొద‌టి స్థానంలో ఉన్న‌ట్లు నివేదిక చెబుతోంది. పేద ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తు గురించి ఆలోచించి BRS క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. కానీ కొంద‌రు వ్య‌క్తులు దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకుని ఆ క‌ళ్యాణ ల‌క్ష్మి డ‌బ్బును క‌ట్నంగా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివారి వ‌ల్ల ఈ ప‌థ‌కం ద్వారా నిజాయ‌తీగా ల‌బ్దిపొందుతున్న వారికి ముందు ముందు క‌ష్టం అవుతుంద‌ని చెప్పాలి. ఒక‌వేళ ఈ ప‌థ‌కం వ‌ల్ల వ‌ర‌క‌ట్న వేధింపులు ఎక్కువ అవుతున్నాయ‌ని తెలిస్తే దానిని నిలిపివేసే అవ‌కాశాలు లేక‌పోలేదు.