శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది: అమితాబ్
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్‌లో గాయపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న అమితాబ్…. ‘కొన్ని రోజుల పాటు అభిమానుల్ని కలవలేను, షూటింగులు కూడా రద్దు చేసుకొన్నాను. ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న టైంలో గాయాల పాలయ్యాను. పట్టెటెముకులకు దెబ్బ తగిలింది. వెంటనే షూటింగ్ రద్దు చేసుకొని హైదరాబాద్ లోని ఏఎంజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్నాను. ఊపిరి తీసుకొంటున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ముంబైలోని నా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకొంటున్నాను” అంటూ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రాజెక్ట్ కె చిత్రానికి సంబంధించిన షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్ గాయపడ్డారు. ఆయన పక్కటెముకలకు గాయమవగా.. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స అనంతరం అమితాబ్ ముంబై చేరుకున్నారు. తన పక్కటెముకల్లో గాయమైందని తన బ్లాగ్‌లో రాసిన అమితాబ్.. ప్రస్తుతం ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని అంతవరకు షూటింగ్ జరగదని తెలిపారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన్ని రెండు, మూడు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా కోరారట. అందుకే ఆయన తిరిగి ముంబై వెళ్లినట్టు తెలుస్తుంది.దీంతో ‘ప్రాజెక్ట్ కె’ తో పాటు అమితాబ్ నటిస్తున్న సినిమాల షూటింగ్లు వాయిదా పడ్డాయి. ఇక ప్రాజెక్ట్ కె చిత్రాన్ని ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకోనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. మరోపక్క వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ను కూడా జరుపుకుంటుంది. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
బాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా సినిమాల్లోనూ నటిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నారు బిగ్ బీ. అంతేకాదు బుల్లితెరపైనా వ్యాఖ్యాతగా అందరి మనసులూ దోచుకున్నారు. తెలుగులోనూ మనం సినిమాలో కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన బిగ్‌బీ, గతేడాది విడుదలైన బ్రహ్మాస్తలో నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న అమితాబ్‌కి గాయమైందన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.