‘మమ్మల్ని గర్వపడేలా చేశావు..’ రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్!
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు వీల్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు సానియాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సానియాకు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన మంచి స్నేహితులు. అందుకే, టెన్నిస్ కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా ప్రశంసలు కురిపిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు రామ్ చరణ్. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.‘నా ప్రియమైన స్నేహితురాలు సానియా మీర్జా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ కోర్టులు నీ ఆటను మిస్ అవుతాయి. దేశ క్రీడారంగానికి నువ్వు చేసిన సేవ చాలా గొప్పది. నువ్వు ఎప్పుడూ మమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను’ అని చరణ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు సానియా, తన భార్య ఉపాసనతో కలిసి దిగిన ఫొటోను కూడా రామ్ చరణ్ షేర్ చేశాడు. ఫోటోలో దంపతులిద్దరూ చెరో పక్కన ఉండగా.. మధ్యలో సానియా నిల్చుంది. ఈ ఫోటో చాలా క్యూట్ గా ఉండి నెట్టింట హల్చల్ చేస్తోంది.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడి, రెండు దశాబ్దాల క్రితం తొలి డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోనే క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో తన సుదీర్ఘ కెరీర్‌కు ఆదివారం భావోద్వేగ వీడ్కోలు పలికింది. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన రెండు మిక్స్డ్ డబుల్స్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లోనూ సానియా జోడీ విజేతగా నిలిచింది. తన సుదీర్ఘ కెరియర్ తో ఎన్నో ఘనతలు సాధించిన, దేశంలో టెన్నిస్ కు ఎంతో ప్రచారం తీసుకొచ్చిన సానియాకు అన్ని వైపుల నుంచి వీడ్కోలు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇరవై ఏళ్ల క్రితం తొలి డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో.. ప్రముఖుల సమక్షంలో సానియా తన సుదీర్ఘ కెరీర్‌కు ఆదివారం వీడ్కోలు పలికింది. మరెందరో సానియాలను తయారు చేయడమే తన లక్ష్యమంటూ అభిమానులకు స్పష్టం చేసింది. వీడ్కోలు వేదికపై సానియాను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ సన్మానించారు.
తొలి డబ్ల్యూటీఏ టైటిల్ (2004లో) నెగ్గిన ఎల్బీ స్టేడియంలో అల్విదా చెప్పింది. ఇప్పటికే ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్.. ఆదివారం ఎల్బీ టెన్నిస్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడింది. కేంద్ర, రాష్ట్ర మంత్రుల నుంచి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. స్టేడియం అంతా సానియా నామస్మరణతో మార్మోగింది. సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 43 డబ్ల్యూటీఏ ట్రోఫీలు గెలుచుకున్నది. భారత టెన్నిస్‌లో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగింది. గత నెలలో దుబాయ్ ఓపెన్‌తోనే ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా టెన్నిస్ ఓనమాలు నేర్చిన ఎల్బీ స్టేడియంలో ఆడాలనే ఉద్దేశంతో ఆదివారం ప్రత్యేక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొన్నది. ఎగ్జిబిషన్ మ్యాచ్ ముగిశాక ఇచ్చిన వీడ్కోలు సందేశంలో కెరీర్‌లో సాధించిన విజయాలు, ఎదురైన ఒడిదుడుకులను తలుచుకుని సానియా భావోద్వేగానికి లోనై, కన్నీటి పర్యంతమైంది. సానియా ఆఖరి మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్, క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, మాజీ క్రికెటర్లు అజరుద్దీన్, యువరాజ్ సింగ్, హీరో దుల్కర్ సల్మాన్ తరలివచ్చారు.