Pawan Kalyan: ప్ర‌చారంలో సినిమాలు, హీరోల గురించి ఎందుకు?

AP: ఏపీలో అటు TDP, జ‌న‌సేన (janasena) ప్ర‌చారాలు జోరుగా సాగుతున్నాయి. జ‌న‌సేనాని (pawan kalyan) వారాహి యాత్ర‌ను ఉభ‌య గోదావ‌రి జిల్లాలో చేప‌డుతున్నారు. సాధార‌ణంగా రాజ‌కీయ ప్ర‌చారం అంటే జ‌నానికి అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం చేసిన వాటి గురించి మాట్లాడ‌తారు. లేదా తాము అధికారంలోకి వ‌స్తే ఏం మంచి చేస్తారో చెప్తారు. ఇవ‌న్నీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆల్రెడీ ప్ర‌చారాల్లో ప్ర‌స్తావిస్తున్నారు కానీ.. మ‌ధ్య‌లో సినిమాలు, హీరోల ప్ర‌స్తావ‌న ఎందుకు? నిన్న ముమ్మిడివ‌రంలో పవన్ మాట్లాడుతూ.. సినిమాలు రాజ‌కీయాలు వేర‌ని చెప్తూనే ప్ర‌భాస్, ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు త‌న‌కంటే పెద్ద హీరోల‌ని అన్నారు.

సినిమాల్లో ఫ‌లానా హీరో అంటే ఇష్టం క‌దా.. ఎందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే న‌టుడికి ఓటు వేయాలి అని ఆలోచించేవారి కోసం ప‌వ‌న్ ఈ కామెంట్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం త‌నని తాను త‌క్కువ చేసుకుని ప‌వ‌న్ మాట్లాడుతున్నారు. అంటే గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఓడిపోవ‌డానికి ఒక‌ కార‌ణం కాపు ఓటర్లు అయితే.. మ‌రో కార‌ణం ఇత‌ర హీరోల ఫ్యాన్స్ ఈయ‌న‌కు ఓటు వేయ‌క‌పోవ‌డం అని ప‌వ‌న్ అనుకుంటున్నారు. అది నిజ‌మే కానీ.. అలా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని బ‌ట్టి ఎంత మంది త‌మ నాయ‌కుడ్ని ఎన్నుకుంటారు అనేది కూడా ఆలోచించాలి.

రాజ‌కీయాల‌కు వ‌చ్చేస‌రికి ప్ర‌చారంలో సినిమా డైలాగులు, హీరోల పేర్లు చెప్తే సీరియ‌స్‌నెస్ లేదు ఎలివేష‌న్లు ఇస్తున్నాడు అనుకునే ఛాన్స్ లేకపోలేదు. మొన్న ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూ కూడా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నీకు భీమ్లా నాయ‌క్ ట్రీట్మెంట్ ఇస్తా అని ప‌వ‌న్ అన్నారు. ఆయ‌న అన్న ఈ మాట‌కు ఓ రేంజ్‌లో అరుపులు వినిపించాయి. కానీ అది ఫ్యాన్స్ వ‌ర‌కే ప‌రిమితం కానీ సాధార‌ణ జ‌నానికి ఇలాంటి డైలాగులు ఎక్క‌వు. ప‌వ‌న్ ఎక్కువ‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డ‌మే కాకుండా తాను అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏం చేయ‌బోతున్నారు క్లారిటీగా చెప్తే గెలిచే అవ‌కాశం క‌చ్చితంగా ఉంది.