GIS గ్రాండ్‌ సక్సెస్‌.. జగన్‌ స్కెచ్‌ అదిరిపోయిందిగా!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయమే ఉంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్‌ ఇన్మెస్టర్స్‌ సమ్మిట్‌(జీఐఎస్‌)-2023 గ్రాండ్‌ హిట్‌ అయ్యిందని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నాయి. ఇప్పటి వరకు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ.. అవే తనను గెలిపిస్తాయని భావించిన సీఎం జగన్‌పై ప్రతిపక్షాలు, ప్రజల్లో ఓకింత రాష్ట్రంలో అభివృద్ది జరగట్లేదని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జీఐఎస్‌ సమ్మిట్‌ నిర్వహించి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెప్పించడంలో సీఎం జగన్‌ కొంత వరకు సక్సెస్‌ అయ్యారనే చెప్పవచ్చు. మరి ఈ అంశం ద్వారా రానున్న ఎన్నికల్లో జగన్‌ మైలేజ్‌ పొందుతారా లేదా? సమ్మిట్‌లో జరిగిన ఎంవోయూలపై ప్రత్యేక కథనం..


ప్రచారం అదుర్స్‌..

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహణను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనికి ప్రచారం కల్పించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్‌ షోలను నిర్వహించి పారిశ్రామిక వేత్తలను పెద్దఎత్తున ఆకర్షించారు. దీంతోపాటు వ్యాపారాల స్థాపనకు ప్రభుత్వం ఏ మేరకు సానుకూలంగా ఉంది.. అందించే ప్రోత్సాహకాల గురించి అందరికీ వివరించింది. హైదరాబాద్‌, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి నగరాలతోపాటు, విదేశీయులను సదస్సుకు రావాలని ఆహ్వానించింది. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం విజయం సాధించిందనే చెప్పవచ్చు. అందువల్లోనే పెద్ద ఎత్తున వ్యాపారులు ఏపీకి తరలివచ్చినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఎన్నడూ బయటి సదస్సులకు రాని ముఖేష్ అంబానీ వంటి పెద్దలు రావడం జగన్ సమర్థతకు నిదర్శనమని అంటున్నారు.

పెట్టుబడులు ఎంత వచ్చాయంటే..
రెండు రోజుల పాటు విశాఖ వేదికగా జరిగిన జీఐఎస్‌ సదస్సులో సుమారు 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరిగాయి. తద్వారా సుమారు 6 లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఏర్పడింది. దాదాపు 352 ఎంవోయూలు జరిగినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో విదేశీ ప్రతినిధులతోపాటు.. దేశంలో అగ్రగామిగా ఉన్న వ్యాపారవేత్తలు అంబాని, అదాని, జిందాల్‌, బంగూరు, దాల్మియా, మిట్టల్‌తోపాటు, భారత్‌ బయోటెక్‌. అపోలో సంస్థల అధినేతలు పాల్గొనడం విశేషం. వీరితోపాటు వియత్నాం, ఆస్ట్రేలియా, నెదర్లాండ్‌ ప్రతినిధులు కూడా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో చర్చించి.. వ్యాపార స్థాపనల గురించి చర్చించారు.

విశాఖ రాజధానిగా ప్రకటిస్తూ.. ఆకర్షించిన జగన్‌..

విశాఖ పెట్టుబడుల సదస్సును సీఎం జగన్ ముందునుంచే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా తొలిరోజు సదస్సులో విశాఖ రాజధానిగా ఉంటుందని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులకు స్పష్టం చేసి అందరికీ ఓ క్లారిటీ ఇచ్చారు. దీంతోపాటు ఏపీలో సుధీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉందని.. రవాణాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వ్యాపారులను ఆయన ఆకర్షించారు. వ్యాపారాల స్థాపనకు ప్రభుత్వ భూములు సుమారు 45వేల ఎకరాలు ఉన్నాయని.. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అందజేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంటుందన్నారు. ఇవన్నీ కూడా సీఎం జగన్‌కు కలిసొచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుంకు కంపెనీ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఇక ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం కుదిరింది కేవలం ఒప్పందాలే.. ఇవి కార్యరూపం దాల్చాలంటే చాలా సమయం పడుతుంది. ఇందులో కనీసం 25 శాతం కార్యకలాపాలు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రం మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ అంశాలన్నీ ప్రజలు గ్రహిస్తారా.. జీఐఎస్‌ జగన్‌కు మంచి చేస్తుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలుతుంది. అయితే.. ఇప్పటికే సంక్షేమ పథకాలతో పేదల మద్దతు పొందిన జగన్‌.. ప్రస్తుతం అభివృద్దివైపు దృష్టి సారించి ముందుకెళ్తున్న తీరు వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపిందని.. జగన్‌ స్కెచ్‌ అదిరిపోయిందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.