KTR: అందుకే KCR ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌రు

Hyderabad: ఇప్ప‌టికే చాలా మంది ముఖ్య‌మంత్రులు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారితో మాట్లాడిన సంద‌ర్భాల‌ను చాలానే చూసాం. కానీ తెలంగాణ ముఖ్య‌మంత్రి KCR మాత్రం సామాన్య ప్ర‌జ‌ల‌తో ఎలాంటి మీటింగులు కానీ వారితో వెళ్లి క‌ల‌వ‌డం కానీ చేయ‌లేదు. ఇందుకు కార‌ణం ఇదే అంటూ వెల్ల‌డించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR. తెలంగాణ (telangana) రాష్ట్రం ఏర్ప‌డి ప‌ది సంవ‌త్స‌రాలు అవుతున్న సంద‌ర్భంగా ఓ ప్ర‌జా ద‌ర్బార్ కార్య‌క్ర‌మంలో KTR మాట్లాడారు.

“ఈ మాట కాస్త వివాదాస్ప‌దం అవుతుంది. అయినా కూడా మీతో చెప్పాల‌నుకుంటున్నాను. కొంత‌మంది అంటుంటారు ముఖ్య‌మంత్రి గారు ప్ర‌జా ద‌ర్బార్‌ను నిర్వ‌హించాలి క‌దా, సామాన్య ప్ర‌జ‌లను క‌ల‌వాలి క‌దా అని. ఈ డౌట్ నాక్కూడా వ‌చ్చింది. అందుకే ఓ సారి సీఎం గారిని నేను ఈ విష‌యం గురించి ప్ర‌శ్నించాను. ఇందుకు ఆయ‌న ఒక్క‌టే మాట చెప్పారు. ప్ర‌భుత్వం అంటే సీఎం ఒక్క‌టే కాదు.. సీఎం ద‌గ్గ‌ర నుంచి చాలా శాఖ‌లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 ల‌క్ష‌ల‌కు పైగా ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఒక పెన్ష‌న్ కోస‌మో, కరెంటు, నీళ్లు రావ‌డంలేద‌నో ఒక సామాన్య వ్య‌క్తి సీఎం ఇంటి ముందుకో కార్యాల‌యం ద‌గ్గ‌రికో వ‌చ్చి నిల‌బ‌డి అడుగుతున్నాడంటే ఆ రాష్ట్ర వ్య‌వ‌స్థే బాలేద‌ని అర్థం. సీఎం కింద ఉన్న వివిధ శాఖ‌లు స‌రిగ్గా ప‌నిచేయడంలేద‌ని అర్థం. ఇలాంటి స‌మ‌స్య‌లు ఎక్క‌డిక‌క్క‌డే వాటికి సంబంధించిన శాఖ‌ల్లో ప‌రిష్కారం కావాలి కానీ సీఎం వ‌చ్చి ప్ర‌జ‌ల‌తో మాట్లాడితేనే ప‌రిష్కారం అవుతుంది అనుకోకూడ‌దు. అలా అనుకునేవారు ఏదో షో చేయ‌డం కోసం చేసే ప‌నులు. నేను అలాంటివి చేయ‌ను అని మ‌మ్మ‌ల్ని మంద‌లించారు” అని వెల్ల‌డించారు కేటీఆర్.